మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందగా, తాజాగా రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సుదీర్ఘంగా 10 గంటలపాటు చర్చ జరిగింది. అనంతరం ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. ఈ బిల్లుకు అనుకూలంగా 215 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో పార్లమెంటు ఉభయసభల్లోనూ ఈ బిల్లు ఆమోదం పొందింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణకు నేటితో తెరపడినట్లు అయింది. నియోజకవర్గలా డీలిమిటేషన్ అనంతరం చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును సెప్టెంబర్ 19న లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. 20న లోక్ సభలో చర్చ జరిగింది.
లోక్సభలో కూడా సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా 454 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారు. ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో వివిధ పార్టీలకు చెందిన 132 మంది సభ్యులు భాగస్వాములయ్యారని ప్రధాని మోదీ తెలిపారు. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కాకుండా మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను వేగిరం చేయాలని పలువురు సభ్యులు కోరారు.
రాజ్యాంగ 128వ సవరణ బిల్లు ఈ మహిళా రిజర్వేషన్ల అంశానికి సంబంధించినది. ఈ బిల్లు ప్రకారం లోక్ సభ, అసెంబ్లీలో మూడోవంతుకు సమానమైన సీట్లను మహిళలకు కేటాయించాలి. అందులో మూడో వంతు సీట్లను ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన మహిళలకు కేటాయించాలి. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, ఢిల్లీ అసెంబ్లీలలో మహిళలకు రిజర్వ్ అయిన సీట్ల రొటేషన్.. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనంతరం ప్రారంభమవుతుంది.