ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు సరికొత్త ప్రమాదాన్ని పెంచవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) వెల్లడించింది. కేసుల పెరుగుదల భవిష్యత్‌లో ప్రమాదకర వేరియంట్‌గా పరిణమించవచ్చని హెచ్చరిస్తోందని డబ్ల్యుహెచ్ఒ సీనియర్ ఎమర్జెన్సీస్ ఆఫీసర్ కేథరీన్ స్మాల్‌వుడ్ తెలిపారు.
ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తూ.. ప్రజల్లో అధకంగా వైరస్‌ని విస్తరింపచేస్తుందని, దీంతో మరోకొత్త వేరియంట్ ఉత్పన్నంకావచ్చని, .. మరణాలకు దారితీయవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా కంటే తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. అనంతరం వచ్చే వేరియంట్ తీవ్రత ఎలా ఉంటుందో ఎవరూ ఊహంచలేరని పేర్కొన్నారు.
మహమ్మారి ప్రారంభమైనప్పటినుండి ఐరోపాలో పది కోట్ల కేసులు నమోదవగా.. గతేడాది చివరి వారం నుండి 50 లక్షలకు పైగా కేసులు వచ్చాయని పేర్కొంటూ గతంలో కన్నా తీవ్రమైన పరిస్థితులు రావచ్చని హెచ్చరించారు.
ప్రస్తుతం ప్రజలు ప్రమాదకర దశలో ఉన్నారని, పశ్చిమ ఐరోపాలో వ్యాధి రేటు గణనీయంగా పెరుగుతోందని, అయితే పూర్తి ప్రభావం ఇంకా స్పష్టంగా లేదని చెప్పారు. డెల్టాతో పోలిస్తే.. ఒమిక్రాన్ వేరియంట్‌తో ఆస్పత్రుల్లో చేరే ప్రమాదం తక్కువ అని చెబుతూ మొత్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య అధిక ముప్పును కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫ్రాన్స్ లో కొత్త వేరియంట్
మరోవైపు ఫ్రాన్స్‌లో కరోనా కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఒమైక్రాన్‌లో 37 ఉత్పరివర్తనాలు జరగగా.. ఇందులో 46 మ్యుటేషన్లను గుర్తించారు. ఫ్రాన్స్‌లోని ఐహెచ్‌యూ మెడిటేరియన్ ఇన్ఫెక్షన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించినందున.. ఆ సంస్థ పేరిట కొత్త వేరియంట్‌ను ‘ఇహూ’ (ఐహెచ్‌యూ) అని పిలుస్తున్నారు. సాంకేతిక పరిభాషలో ‘బి.1.640.2’ వేరియంట్‌గా వర్గీకరించారు.
దీనితో ముడిపడిన తొలి 12 కేసులు ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్ నగర శివారులో బయటపడ్డాయి. బాధితులంతా ఇటీవల ఆఫ్రికా దేశం కామెరూన్ నుంచి వచ్చిన వారేనని తేలింది. అయితే దాని వ్యాప్తి అంతంత మాత్రమేనని నిపుణులు పేర్కొన్నారు.
ఇలా ఉండగా, ఓ వైపు కరోనా కేసులు, మరోవైపు ఒమైక్రాన్ వేరియంట్ భారత దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రోజువారీ కరోనా కేసులు 50వేలు దాటుతుండగా… ఒమైక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య 2,135కి చేరింది.
అలాగే ఒమైక్రాన్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 828గా ఉంది. రాష్ట్రాల వారీగా ఒమైక్రాన్ కేసులు ఈ విధంగా ఉన్నాయి. మహారాష్ట్ర 653, ఢిల్లీ 464, కేరళ 185, రాజస్థాన్ 174, గుజరాత్ 154, తమిళనాడు 121, తెలంగాణ 84, కర్ణాటక 77, హర్యానా 71 ,ఒడిశా, ఉత్తరప్రదేశ్ 31, ఆంధ్ర ప్రదేశ్ 24, వెస్ట్ బెంగాల్ 20 , మధ్యప్రదేశ్ 9 ,ఉత్తరాఖండ్ 8, గోవా 5 కేసులు నమోదు అయ్యాయి.
సోమవారం ఒక్క రోజే అమెరికాలో 10.40 లక్షల మంది వైరస్ బారినపడడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఏ దేశంలోనూ ఇంత అతి భారీ సంఖ్యలో కేసులు రాలేదు.
అంతేకాదు.. భయంకర డెల్టా వేరియంట్ ఉధృతి కొసాగుతున్న సమయంలో, గత ఏడాది మే 7న అమెరికా మినహా అన్ని దేశాల్లో నమోదైన పాజిటివ్‌లు 4.14 లక్షలు కాగా, ప్రస్తుతం అగ్రరాజ్యంలో వచ్చిన కేసులు అంతకు రెండున్నర రెట్లు.
వారూ వీరని తేడా లేకుండా అన్ని రంగాల సిబ్బందీ వైర్‌సకు గురవుతుండడంతో ప్రజా జీవనంను అతలాకుతలం కావిస్తున్నది. ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.. అత్యవసర పరిస్థితి ఆదేశాలు జారీ అవుతున్నాయి.
విద్యా సంస్థలు మళ్లీ ఆన్లైన్ తరగతులకు మళ్లుతున్నాయి.. వేలాది విమానాలు రద్దవుతున్నాయి. ఆఖిరుకు న్యూ ఓర్లీన్స్ వంటి కొన్నిచోట్ల పారిశుధ్య కార్మికులూ దొరకడం లేదు. పెద్ద, చిన్న తేడా లేకుండా అన్ని రంగాలు సిబ్బంది కొరత ఎదుర్కొంటున్నాయి