సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్‌తో పాటు భార్య తంజీమ్ ఫాతిమా, తనయుడు అబ్దుల్లా ఆజంకు రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. నకిలీ జనన ధ్రువీకరణ పత్రాల కేసులో జైలుశిక్షతో పాటు రూ.15వేల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించిందని మాజీ డీజీసీ (క్రైమ్) సక్సేనా తెలిపారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని నేరుగా జైలుకు తరలించనున్నారు. శాంతిభద్రతల పరిస్థితి తలెత్తకుండా రాంపూర్‌లో పోలీసు భద్రతను పెంచారు. రెండు జనన ధ్రువీకరణపత్రాలు ఉన్నాయంటూ 2019లో అబ్దుల్లా ఆజంపై బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ సక్సేనా కేసు పెట్టారు.
ఆ తర్వాత ఈ కేసులో తంజీమ్ ఫాతిమాను సైతం నిందితులుగా చేర్చారు. ఐపీసీ సెక్షన్ 420, 467, 468, 471 కింద అబ్దుల్లాతో పాటు తల్లిదండ్రుపై కేసు నమోదైంది. అయితే, అబ్దుల్లా తన సౌలభ్యం మేరకు ఎప్పటికప్పుడు రెండు బర్త్ సర్టిఫికెట్లను వినియోగిస్తున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు. ఒకటి లక్నో మున్సిపాలిటీ, మరొకటి రాంపూర్ మున్సిపాలిటీ బర్త్ సర్టిఫికెట్‌ను జారీ చేసింది.
అబ్దుల్లా ఆజం విదేశీ పర్యటన కోసం పాస్‌పోర్ట్ పొందేందుకు ఒక బర్త్ సర్టిఫికెట్‌ను వినియోగిస్తున్నాడని, రెండో సర్టిఫికెట్‌ను ప్రభుత్వ సంబంధిత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు తేలింది. ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్రలో భాగంగానే అక్రమ మార్గంలో సర్టిఫికెట్లు జారీ గుర్తించారు.
కాగా..2019లో చేసిన విద్వేష ప్రసంగానికి సంబంధించి కోర్టు జైలు శిక్ష విధించడంతో సమాజ్‌వవాది పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆజం ఖాన్ 2022 అక్టోబర్‌లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఆయనపై అనర్హత వేటు వేసింది..