ఎగ్జిట్ పోల్స్ చాలావరకు తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సంకేతం ఇస్తున్నప్పటికీ స్పష్టమైన మెజారిటీ ఆ పార్టీకి లభించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకనే మెజారిటీకి అటు- ఇటుగా సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టం కాగలదని భయం వారిని వెంటాడుతున్నది.
మరోవంక, స్పష్టమైన మెజారిటీ వచ్చిన్నప్పటికీ తమ ఎమ్యెల్యేలు కొందరిని బిఆర్ఎస్ ఆకట్టుకోవచ్చనే భయం కూడా వారికి ఆందోళన కలిగిస్తున్నది. మరోవంక, ముఖ్యమంత్రి కేసీఆర్ మనమే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు పార్టీ నేతలకు భరోసా ఇస్తుండటం, సోమవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేయడంతో కేసీఆర్ ఎత్తుగడలు అర్ధంగాక కాంగ్రెస్ నేతలు కలవరం చెందుతున్నారు.
అందుకనే కౌంటింగ్ కు ముందు అధ్యర్థులు ఎవరూ చేజారకూడదని, ఎలాంటి ప్రలోభాలకు లోంగకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలకు సిద్ధమైంది. పార్టీ అభ్యర్థులందరినీ హైదరాబాద్ కు రప్పించాలని హోటల్ తాజ్ కృష్ణలో అభ్యర్థులకు ఎఐసిసి ప్రతినిధులు సూచించినట్లు తెలుస్తోంది. నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు జరగనుంది.
అధికారానికి కావాల్సిన 60 స్థానాలకు కొద్ది దూరంలో ఆగినా..సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ లోని కొందరితో కేసీఆర్ టచ్ లో ఉన్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో, కాంగ్రెస్ అగ్ర నాయకత్వం పార్టీ అభ్యర్దులను వెంటనే హైదరాబాద్ రావాలని సూచించింది.
పార్టీ అగ్రనాయకులు చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, సూర్జేవాలాకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతలు హైకమాండ్ అప్పగించింది. హైదరాబాద్ రానున్న డీకే శివకుమార్ పూర్తిగా ఫలితాలు వెల్లడయ్యే వరకు ఇక్కడే ఉండనున్నారు. కేసీఆర్ ఎత్తుగడలను..వ్యూహా లను కాంగ్రెస్ నిశితంగా గమనిస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాలేని పక్షంలో ఏదోవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ భావిస్తున్నది. అవసరమైతే కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకొనేందుకు బిజెపి, ఎంఐఎం వంటి పార్టీల మద్దతును కేసీఆర్ సమీకరించుకొనే అవకాశం లేకపోలేదు.
కేసీఆర్ ఇలాంటి సమయాల్లో వ్యూహాత్మకంగా పావులు కదుపుతారనే అంచనాలతో కాంగ్రెస్ అన్ని రకాలుగా అప్రమత్తం అవుతోంది. దీంతో, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తెలంగాణ నేతలతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసారు. కౌంటింగ్, ఫలితాలు, గెలిచిన తరువాత సీఎల్పీ సమావేశం.. హంగ్ పరిస్థితే ఏర్పడితే ఏం చేయాలనే దాని పైన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.