మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక వెల్లువ తీవ్ర ఉత్కంఠ మధ్య ఆదివారం వెల్లడైన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, రాజస్థాన్, మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బిజెపి గెలిచింది. వీటిలో రాజస్థాన్; ఛత్తీస్‌గఢ్‌లను ఆ పార్టీ కాంగ్రెస్ నుండి కైవసం చేసుకుంది.
తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు గానూ 64 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కసరత్తు ప్రారంభించింది. వరుసగా రెండు ఎన్నికల్లో గెలుపొందిన బిఆర్ఎస్ తాజా ఎన్నికల్లో 39 సీట్లకే పరిమితమైంది. దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్ తన పదవికి రాజీనామా చేశారు.
నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యేంతవరకు ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ తమిళిసై ఆయన్ను కోరారు. మరోవైపు గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ అగ్రనేతలు ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలియచేస్తూ లేఖను అందచేశారు. సోమవారం ఉదయం కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది.
తెలంగాణలో బిజెపికి 8స్థానాలు దక్కాయి. ఎంఐఎం ఏడు స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలో దిగిన సిపిఐ కొత్తగూడెం స్థానం నుండి గెలుపొందింది. మధ్యప్రదేశ్‌లో బిజెపి మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 230 సీట్లకు గానూ, 164 సీట్లను ఆ పార్టీ సాధించింది. కాంగ్రెస్ 65 స్థానాలకే పరిమితమైంది.
ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వాన్ని మార్చే సాంప్రదాయమున్న రాజస్థాన్ ఓటర్లు తాజా ఎన్నికల్లోనూ ఆ ఒరవడిని కొనసాగించారు. రాజస్థాన్‌లో మొత్తం 200 స్థానాలకు గానూ ఎన్నికలు జరిగిన 199 స్థానాల్లో బిజెపి 115సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ 69 స్థానాలకే పరిమితమైంది.
ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాలకు గానూ, బిజెపి 54 స్థానాలను చేజిక్కించుకోగా, కాంగ్రెస్‌కు 35 స్థానాలే దక్కాయి. మొత్తం మీద బిజెపి రెండు రాష్ట్రాల్లో అదనంగా అధికారంలోకి రావడంతో పాటు తెలంగాణలో కూడా బలాన్ని పెంచుకుంది.
తెలంగాణ, రాజస్థాన్; ఛత్తీస్‌గఢ్‌లలో ప్రభుత్వాలపై వ్యతిరేకత కూడా తీవ్రస్థాయిలో కనిపించింది. ఫలితంగా అధికారంలో ఉన్న పార్టీలు పరాజయం పాలయ్యాయి. రెండు స్థానాల నుండి పోటీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక స్థానంలో ఓటమి చవిచూశారు. ఆరుగురు మంత్రులు కూడా ఓడిపోయారు.