ఒమైక్రాన్ వ్యాప్తితో దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు, వైరస్ కట్టడి, ప్రజారోగ్య సన్నద్ధత గురించి తెలుసుకోనున్నారు. మోదీ ఆదివారం కేంద్ర మంత్రులు, పలువురు కీలక అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
దేశంలో కరోనా పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు. మౌలిక వైద్య వసతులు, పిల్లలు, పెద్దలకు వ్యాక్సిన్ పంపిణీ తీరు తదితరాలను సమీక్షించారు. జిల్లా స్థాయిలో వైద్య వసతులను సంసిద్ధం చేసుకోవాలని.. పిల్లలకు టీకా పంపిణీని యుద్ధప్రాతిపదిక చేపట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కరోనా కట్టడిలో ఆరోగ్య కార్యకర్తల విశేష కృషిని కొనియాడిన ప్రధాని మోదీ, వారితో పాటు ఫ్రంట్‌లైన్ కార్యకర్తలకూ ముందుజాగ్రత్త డోసును యుద్ధప్రాతిపదికన ఇవ్వాలన్నారు. పెద్ద సంఖ్యలో కేసులు వస్తుండడాన్ని దృష్టిలో పెట్టుకుని, లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న పాజిటివ్‌ల హోం ఐసొలేషన్‌ను సమర్థంగా అమలు చేయాలని పేర్కొన్నారు.
కాగా, నాన్ కొవిడ్ సేవలకూ ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని.. గ్రామీణులకు ఆరోగ్య సేవలందిచేందుకు టెలీ మెడిసిన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కేవలం వారం రోజుల్లో 15 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలు 31 శాతం మందికి టీకా అందజేసినట్లు ప్రధాని తెలిపారు.
వీరికి మిషన్ మోడ్ లో వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేయాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న వైనాన్ని, దేశంలో వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలు/జిల్లాల వివరాలను రాజీవ్ గౌబా విశ్లేషించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, నీతీ ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరాం భార్గవ పాల్గొన్నారు.