దేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం సరికొత్త చరిత్రను లిఖించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఇటీవలె ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించగా.. యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును సీఎం పుష్కర్ సింగ్ ధామీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
ఆ ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ప్రస్తుతం అమలు కావడంతో దేశంలో యూసీసీ ఆమోదం పొందిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ మారింది. ఉత్తరాఖండ్ కంటే ముందు గోవా రాష్ట్రంలో బ్రిటీష్ పాలకుల కాలంలోనే ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వచ్చింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూసీసీ బిల్లుకు సభ ఆమోదం కల్పించింది.
ఉత్తరాఖండ్‌కు ఇది చాలా ముఖ్యమైన రోజు అని ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఆమోదం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఈ బిల్లును ఉత్తరాఖండ్ ఆమోదించిందని తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్‌ను ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందని, ఉత్తరాఖండ్ ప్రజలకు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నట్లు పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు.
తాము అధికారంలోకి రావడానికి ఈ యూసీసీ బిల్లును ఆమోదించడానికి తమకు అవకాశం ఇచ్చారని ముఖ్యమంత్రి వెల్లడించారు. అన్ని కోణాల నుంచి ఆలోచించామని, న్యాయ నిపుణుల సలహాలను స్వీకరించిన తరువాతే బిల్లును రూపొందించామని వివరించారు. ఇలాంటి బిల్లును తప్పనిసరిగా రాష్ట్రంలో అమలు పర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు.
ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపితే ఉమ్మడి పౌరస్మృతి బిల్లు చట్టంగా మారనుంది. ఇకపై అక్కడ నివసించే ప్రతి పౌరుడికీ సమాన చట్టం వర్తిస్తుంది. తమ మత విశ్వాసాలకు అతీతంగా ఒకే చట్టాన్ని ప్రజలు అనుసరించాల్సి ఉంటుంది. పెళ్లిళ్ల వంటి శుభాకార్యాలను జరుపుకోవడం, విడాకులు మంజూరు చేయడం వంటివి ఈ సివిల్ కోడ్ యాక్ట్ నిబంధనలకు లోబడే ఉంటాయి.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ.. యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ఆమోదించిన తర్వాత దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కూడా యూసీసీ బిల్లును తీసుకువచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, అస్సాం వంటి రాష్ట్రాలు ఉమ్మడి పౌరస్మృతిని ఆయా రాష్ట్రాల్లో తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.