ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి బిజెపి అధికారంలోకి వస్తుందని జీ న్యూస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ వెల్లడి చేసింది. జీ న్యూస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ప్రతిబింబించే డేటా ప్రకారం, ఉత్తరప్రదేశ్లోని మొత్తం ఓట్లలో 41 శాతం ఓట్లతో బీజేపీ కూటమి ముందంజలో ఉంటుందని, సమాజ్వాదీ పార్టీ 34 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంటుందని తెలిపింది. ఇక బీఎస్పీ 10 శాతం, కాంగ్రెస్ 6 శాతంతో చాలా దూరంలో ఉన్నట్లు పేర్కొన్నది.
రాష్ట్రంలో బిజెపి కూటమి మెజారిటీ సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని కూడా వెల్లడిల్న్చింది. యూపీ ఎన్నికల్లో బీజేపీ 267 (245 నుండి 267 వరకు) సీట్లు గెలుచుకుంటుందని, ఎస్పీ దాదాపు 125 నుంచి 148 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇది బీఎస్పీ 5 నుండి 9, కాంగ్రెస్ 3 నుండి 7 సీట్లు మాత్రమే గెల్చుకోగలవు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్లో కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థులలో బిజెపికి చెందిన ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయ సేకరణలో 47 శాతం ప్రజాదరణతో ముందంజలో ఉన్నారు. ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ 35 శాతం, బీఏపీసీ నేత మాయావతి 9 శాతం, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ 5 శాతంతో ఆ తర్వాతి స్థానాలలో ఉన్నారు.
అంతకుముందు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి “అద్భుతమైన మెజారిటీ” తో గెలుస్తుందని, రాష్ట్రంలో 2017 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి మరింత ఎక్కువ ఓట్లను సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కానీ ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అనుకున్నంత బలంగా లేదని, ఆ పార్టీ చాల వెనుకబడి ఉందని స్పష్టం చేశారు. “నిజానికి ఐదేళ్ల మా పాలనలో మాఫియా, గూండాలను రాష్ట్రం బయటికి తరిమికొట్టాం. అయితే జైల్లో వేశాం. కానీ సమాజ్వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో గూండాలను, మాఫియాను మళ్లీ దింపుతోంది. ఆ పార్టీ విడుదల చేసిన మొదటి జాబితాలో అందరూ వారే ఉన్నారు’’ అని ధ్వజమెత్తారు.