తొలుత ముగ్గురు మంత్రులతో పాటు 11 మంది ఎమ్యెల్యేలు, ముఖ్యంగా ఓబిసి వర్గాలకు చెందిన వారు బిజెపికి రాజీనామా చేయడం, దాదాపు అందరు సమాజవాద్ పార్టీలో చేరడంతో ఇక ఉత్తర ప్రదేశ్ లో బిజెపి పనైపోయిందని అంటూ దేశంలో కొందరు సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు.
అయితే ఈ పరిణామాల పట్ల మౌనంగా, ఏమీ పట్టన్నట్లు వ్యవహరించిన బిజెపిలోకి ఇప్పుడు వలసల బయలుదేరడం ప్రతిపక్షాలలో కలవరం కలిగిస్తున్నది. మొదటగా ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని అంటూ సంకేతాలు ఇస్తున్న ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మరదలు, ఆ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరడంతో షాక్ కు గురయ్యారు.
ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన “లడకీ హూఁ, లడ్ సక్తీ హూఁ’’ (నేను బాలికను, నేను పోరాడగలను) ప్రచారంలో పోస్టర్ గర్ల్, యూపీ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. ప్రియాంక మౌర్య బీజేపీలో చేరబోతున్నట్లు కధనాలు వెలువడ్డాయి. శాసన సభ ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆమె కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ తన కీర్తి, ప్రతిష్ఠలను ఉపయోగించుకుందని చెప్పారు. తనకు సామాజిక మాధ్యమాల్లో 10 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారని, ప్రచారం కోసం దీనిని కూడా వాడుకుందని ఆరోపించారు. అయితే టిక్కెట్ల పంపిణీ వరకు వచ్చేసరికి వేరొకరిని ఎంపిక చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ టిక్కెట్లను అమ్ముకొంటున్నారని అంటూ ఆమె నేరుగా ప్రియాంక గాంధీ పైననే విమర్శలు గుప్పించారు. ఆమె బీజేపీలో చేరబోతున్నట్లు సంకేతం ఇచ్చారు.
బీజేపీ మద్దతుతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే నితిన్ అగర్వాల్, జలాలాబాద్‌కు చెందిన మరో ఎస్పీ ఎమ్మెల్యే శరద్వీర్ సింగ్ కూడా తమ పార్టీకి రాజీనామా చేశారు. అగర్వాల్ డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరిద్దరూ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది.
జలాలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన ఎస్పీ శాసనసభ్యుడు శరద్వీర్ సింగ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎస్పీ టిక్కెట్ నిరాకరించడంతో పార్టీని వీడారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన తన రాజీనామా లేఖలో సింగ్, “ములాయం సింగ్ యాదవ్ విధానాలపై నాకున్న నమ్మకంతో నేను 1995లో ఎస్పీలో చేరాను. నేను 1996 నుండి జలాలాబాద్ ప్రజలకు సేవ చేస్తున్నాను, కానీ ఇప్పుడు మీ (అఖిలేష్ యాదవ్) ఎస్పీ. ములాయం సింగ్ విధానాల నుంచి తప్పుకున్నారు” అంటూ ఆరోపించారు.
“బిఎస్పి హయాంలో వ్యాపారులు మరియు సమాజంలోని ఇతర వర్గాలపై అఘాయిత్యాలకు పాల్పడిన అభ్యర్థికి ఇక్కడ నుండి టిక్కెట్ ఇవ్వబడింది. మీ నిర్ణయంతో బాధపడ్డాను, నేను రాజీనామా చేస్తున్నాను” అని ఆయన అన్నారు.