కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీని చూస్తే విచిత్రమైన భావన కలుగుతున్నదని చెబుతూ కాంగ్రెస్ తీరు చూస్తుంటే కొన్నిసార్లు బీజేపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందేమోనని అనుమానం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ‘డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డిపిఎపి)’ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో సంస్థాగతమైన మార్పు కోసం గతంలో 23 మంది నేతలు పోరాడారని, కానీ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం వారి మాటలు వినిపించుకోలేదని ఆయన తెలిపారు. సమస్యలు లేవనెత్తినప్పుడు తామంతా బీజేపీ భాష మాట్లాడుతున్నామని హైకమాండ్ విమర్శించేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ హైకమాండే బీజేపీ గెలుపును కోరుకుంటున్నట్లు తనకు చాలాసార్లు అనిపించిందని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ దేశంలో పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ప్రధాన సమస్యలని గులాం నబీ ఆజాద్ చెప్పారు. సుమారు రెండేళ్ల క్రితం ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడారు. అప్పట్లో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రాకతో పార్టీ పతనం మొదలైందని మండిపడ్డారు. పరిణతి లేని ఆయన నాయకత్వం వల్లే భారమైన హృదయంతో పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులు తేవాలని, క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తూ కొందరు సీనియర్లు (జీ-23 గ్రూపు) గతంలో సోనియా గాంధీకి లేఖ రాశారు. అది అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ నాయకుల్లో ఆజాద్‌తో పాటు కపిల్ సిబల్ తదితరులు ఉన్నారు. కాగా, ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆజాద్ జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ – రాజౌరీ స్థానం నుంచి పోటీ పడుతున్నారు.
మరోవైపు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా అదే స్థానం నుంచి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అనంతనాగ్-రాజౌరీలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల మధ్య ప్రధాన పోటీ నెలకొననుంది. జమ్ముకశ్మీర్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలకు విడివిడిగా ఐదు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో దశలో పోలింగ్ నిర్వహించనున్నారు.