కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని పరిశీలించడానికి… అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత కమిటీని నియమించనున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి కేంద్రం లేఖ రాసిందని దీనికి ఈసీ బదులిస్తూ ఎన్నికల అనంతరం కమిటీని నియమించుకోవచ్చని సూచించిందని మంత్రి స్పష్టంచేశారు.
పార్లమెంటు సమావేశాల్లో భాగంగా క్వశ్చన్ అవర్లో అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఎంఎ్సపీకి చట్టబద్ధత విషయంలో కమిటీ ఇచ్చే సిఫార్సులను పరిశీలించి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో ధాన్యం సేకరణ తగ్గించడం, ఎంఎ్సపీ అమలుకాకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఈ విషయంలో కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర మంత్రిని అడిగారు.
దీనికి మంత్రి బదులిస్తూ.. రైతులు తాము పండించిన పంటను సరైన ధరకు అమ్ముకోవడానికి కేంద్రం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ధాన్యం సేకరణను పెంచడంతోపాటు పీఎం కిసాన్, మౌలిక సౌకర్యాల నిధి ఏర్పాటు వంటి కార్యక్రమాలను కేంద్రం అమలుచేస్తుందని చెప్పారు.
తెగుళ్ల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 40-80 శాతం మిర్చి పంటకు నష్టంవాటిల్లిందని తోమర్ వెల్లడించారు. పంట సమయంలో సంభవించిన వాతావారణ మార్పులే ఈ నష్టానికి కారణమని చెప్పారు.