ఈ నెల 10న జరుగనున్న ఉత్తరప్రదేశ్ తొలి దశ ఎన్నికలలో మొత్తం 623 మంది పోటీ చేస్తున్నారు. అయితే వారిలో 15 మంది నిరక్షరాసులే . ఈ విషయాన్ని అసోషియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) నివేదికలో వెల్లడించింది. తొలి దశలో భాగంగా 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఎన్నికల్లో పోటీచేస్తున్న 615 మంది అభ్యర్థుల ప్రమాణ పత్రాల్లో పేర్కొన్న విద్యార్హతలను పరిశీలించిన శనివారం ఈ నివేదికను విడుదల చేసింది. మిగిలిన 8 మందివి సాంకేతిక కారణాల వల్ల పరిశీలించలేకపోయినట్లు తెలిపింది.
ఇందులో 15 మంది నిరక్షరాసులు కాగా, 38 మంది అక్ష్యరాస్యులు. 5వ తరగతి చదివిన వారు 10 మంది, ఎనిమిది పాసైన వారు 62 మంది, పది పూర్తి చేసిన వారు 65 మంది, 102 మంది 12వ తరగతి చదివిన వారు ఉన్నారు.
పట్టభద్రులు 100 మంది, గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్స్ 78 మంది, పోస్టు గ్రాడ్యుయేషన్ 108 మంది, డాక్టరేట్ 18 మంది, డిప్లామా ఏడుగురు, 12 మంది విద్యార్హతలను పేర్కొనలేదని నివేదికలో తెలిపింది. 239 మంది అభ్యర్థుల విద్యార్హత 5-12 మధ్య ఉన్నట్లు పేర్కొంది.
మరో 304 మంది గ్రాడ్యుయేషన్ అంత కన్నా ఎక్కువ చదివినట్లు పేర్కొంది. ఈ అభ్యర్థుల్లో 73 మంది 60 ఏళ్ల పైబడిన వారని పేర్కొంది. 214 మంది అభ్యర్థులు 25 నుండి 40 ఏళ్ల మధ్య వయస్కులు కాగా, 328 మంది 41 నుండి 60 ఏళ్ల వారే.