ట్రిపుల్ తలాక్ పద్ధతిని నిషేధించడం ద్వారా బీజేపీ ప్రభుత్వం ముస్లిం మహిళలకు న్యాయం చేసిందని పేర్కొంటూ “కానీ మన ముస్లిం సోదరీమణులు మోదీని ప్రశంసించడం చూసిన ప్రతిపక్ష పార్టీలు వారిని అడ్డుకోవాలని భావించాయి” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. “ముస్లిం మహిళల వారి హక్కులు, ఆకాంక్షల మార్గంలో అడ్డుగా నిలబడడానికి కొత్త మార్గాలతో ముందుకు వస్తున్నారు” కర్ణాటకలోని హిజాబ్ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శించారు.
‘‘ఇప్పుడిప్పుడే హక్కులను, అభివృద్ధిని సాధించుకుంటున్న ముస్లిం మహిళలను అడ్డుకోవడానికే ఇలాంటి కొత్త ఎత్తులు వేస్తున్నారు’’ అంటూ కర్ణాటకను రగిలిస్తున్న హిజాబ్ ధారణ అంశాన్ని పరోక్షంగా ఆయన ప్రస్తావించారు
శాసన సభ ఎన్నికల ప్రచారంలో, కరోనా మహమ్మారి ఆంక్షల నేపథ్యంలో, తొలిసారి ప్రత్యక్షంగా యూపీలోని సహరాన్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ, ముస్లిం మహిళలపై నేరాలను అరికట్టేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ప్రధాని కొనియాడారు. అయితే మరోవైపు ప్రతిపక్షాలు ఓట్ల కోసం ముస్లిం మహిళల ప్రగతికి అడ్డుగా నిలుస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వం బాధితురాలైన ప్రతి ముస్లిం మహిళకు అండగా నిలుస్తుండగా ప్రధాని భరోసా ఇచ్చారు. అయితే ప్రతిపక్ష పార్టీలు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. “ఆ వ్యక్తులు ముస్లిం సోదరీమణులను మోసగిస్తున్నారు, తద్వారా ముస్లిం కుమార్తెల జీవితం ఎల్లప్పుడూ వెనుకబడి ఉంటుంది,” అని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం మహిళలు అణచివేతకు గురికాకుండా చూడటానికి ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అవసరమని స్పష్టం చేశారు.
2013 ముజఫర్‌నగర్ అల్లర్లు, అలాగే 2017లో సహరన్‌పూర్‌లో జరిగిన హింసాకాండ “రాజకీయ అండదండలతో ప్రజలను ఎలా లక్ష్యంగా చేసుకుంటున్నారనే దానికి నిదర్శనం” అని ఆయన విమర్శించారు.
ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ఇలా అన్నారు: “ఉత్తరప్రదేశ్‌ను అభివృద్ధి చేసే వారికే ప్రజలు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ను అల్లర్లు లేకుండా ఉంచే వారికి, మన తల్లులను, కుమార్తెలను భయం లేకుండా ఉంచేవారికి, నేరస్థులను జైల్లో ఉంచేవారికి ప్రజలు ఓటు వేస్తారు. పరివార్-వాద పార్టీ మొత్తం బూటకపు వాగ్దానాలు చేస్తోంది. వారు విద్యుత్తు వాగ్దానం చేసారు కానీ యుపి అంతా చీకటిలో ఉంచారు”.
సమాజ్ వాదీ పార్టీ కుటుంభం రాజకీయాల ద్వారా “నకిలీ సోషలిజం”లో నిమగ్నమైందని కూడా ఆయన ఆరోపించారు. “మీరు లోహియాజీ, జార్జ్ ఫెర్నాండెజ్, నితీష్ కుటుంబాలను చూడగలరా? వారు సోషలిస్టులు. ఎస్పీ నుండి 45 మంది వ్యక్తులు, కొంత పదవిలో ఉన్నారని నాకు లేఖ వచ్చింది. ఈ వంశపారంపర్యం ప్రజాస్వామ్యానికి ముప్పు” అని ప్రధాని హెచ్చరించారు.
ప్రభుత్వం ద్వారా తాను వ్యాపారం చేయడం లేదని, చిన్న రైతులు, రోడ్లు, ప్రజలకు ఇతర సౌకర్యాల నిర్మాణంపై తన దృష్టి ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
కాగా, యోగి ప్రభుత్వంలో పేదలు రూ.ఐదులక్షల వరకు మంచి వైద్యశాలలో చికిత్సను ఉచితంగా పొందుతున్నారనీ, యూపీలో యోగి ఉండటం వల్లే కేంద్రం అందించే పీఎమ్ కిసాన్ యోజన పథకం లబ్ధి చివరి పేద రైతు వరకూ చేరుతున్నదని, ప్రతి పేదవాడూ పీఎం అవాస్ యోజన కింద సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటున్నాడనీ, దశాబ్దకాలంలో ఎన్నడూ అందుకోనంత ధరను చెరుకు రైతులు ఇప్పుడు పొందుతున్నారని మోదీ ఏకరవు పెట్టారు.
కరోనా సమయంలో పూర్తి ఉచితంగా రేషన్ అందించామన్న ఆయన.. అదేగనుక ఆ సమయంలో ‘కుటుంబ వారసత్వ వాదులు’ యూపీలో అధికారంలో ఉంటే కొవిడ్ వ్యాక్సిన్లను బజారులోపెట్టి విక్రయించేవారని వ్యాఖ్యానించారు.
అటు.. ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్, గోవాల్లో జరిగిన ప్రచార సభల్లోనూ ప్రధాని పాల్గొన్నారు. జనరల్ రావత్‌ను రోడ్డుసైడ్ పోకిరీ అంటూ తిట్టినవారే ఇప్పుడు ఆయన కటౌట్లు పెట్టుకుని ఉత్తరాఖండ్‌లో ఓట్లు అడుగుతున్నారని కాంగ్రె్‌సను విమర్శించారు.
ఇక.. నాడు (1947) నెహ్రూ కోరుకుని ఉంటే కొన్ని గంటల్లోనే గోవా విముక్తిని పొందేదని..ఆ పని చేయకపోవడంతో 17 ఏళ్లు అందుకు ఎదురుచూడాల్సి వచ్చిందని గోవాలోని మపుసాలో జరిగిన ఎన్నికల సభలో ఆయన వ్యాఖ్యానించారు.