అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము తిరిగి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరసృతి చట్టం తీసుకు రాగలమని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించడంతో ఈ విషయమై మరోసారి జాతీయ స్థాయిలో చర్చ ప్రారంభమైనది.
ముఖ్యంగా కర్ణాటకలో జిహాబ్ వివాదం చెలరేగడంతో, దానిని ఆసరాగా చేసుకొని మతపరమైన విభజనకు పురికొల్పి, ఉత్తరాది రాష్ట్రాలలో హిందువుల ఓట్లు పొందడం కోసం బిజెపి ఈ రాష్ట్రం ప్రయోగిస్తున్నట్లు భావిస్తున్నారు.
పలువురు బిజెపి నేతలు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతించారు. ఉత్తర ప్రదేశ్ తో పాటు ఇతర బిజెపి పాలిత రాష్ట్రాలలో సహితం అటువంటి డిమాండ్లు తలెత్తుతున్నాయి. అయితే ఈ విషయమై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా అటువంటి చట్టం వారే తేగలరు.
కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి చట్టం రాగలవా అనే ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తుతున్నది. రాష్ట్రాలకు అటువంటి చట్టం చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా అనే అంశంపై న్యాయ నిఫుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాలకు ఇలాంటి అధికారం ఉంటుందని కొందరు చెబుతుంటే, లేదని కొందరు వాదిస్తున్నారు.
ఈ అంశంపై రాజ్యాంగ నిపుణులు, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పిడిటి ఆచారి మీడియాతో మాట్లాడుతూ వివాహం, విడాకులు, వారసత్వం, ఆస్తి హక్కులు వంటి అంశాలు రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలోకి వస్తాయని గుర్తు చేశారు.
కాబట్టి ఇలాంటి చట్టాన్ని తీసుకు రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ అధికారం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల కోసం చట్టాలు చేసే అధికారం ఆయా రాష్ట్రాలకు ఉంటుందని పేర్కొన్నారు.
అయితే, ఇలాంటి చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ ద్వారా కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని కేంద్ర మాజీ న్యాయ కార్యదర్శి పికె మల్హోత్రా స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 భారత దేశంలోని ప్రజలందరినీ సూచిస్తున్నందువల్ల ఇలాంటి అధికారం రాష్ట్రాలకు లేదని వాదించారు.
గోవాలో ఇలాంటి చట్టం ఉండటంపై మల్హోత్రా స్పందిస్తూ భారత్లో గోవా భాగం కాకముందు ఈ చట్టం రూపొందించారని తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతి బిజెపి ఎన్నికల హామీల్లో ఒకటి.
ఈ చట్టం గురించి ప్రస్తుత కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు. 22వ భారత లా కమిషన్ ఈ చట్టం గురించి ప్రతిపాదన చేసే అవకాశం ఉందని లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు.