రష్యా తన సరిహద్దు దేశమైన ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించడంతో నిర్దిష్టంగా ఒక విధానం అనుసరించడంలో భారత్ సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఇది రష్యా – అమెరికాల మధ్య ప్రచ్ఛన్న పోరుగా మారడం, ఆ రెండు దేశాలతో భారత్ కు వ్యూహాత్మకంగా, రక్షణపరమైన సంబంధాలు ఉండడంతో ఏదో ఒకవైపు మొగ్గలేని ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
దానితో తాము తటస్థవైఖరిని ఆవలంభిస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. రష్యా వెంటనే తన దాడిని నిలిపివేయాలని కోరుతూ అమెరికా భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ లో భారత్ పాల్గొనలేదు. అయితే దౌత్యపరంగా సమస్యలు పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకుండా, సాయుధ చర్యకు దిగడం పట్ల అసంతృప్తి మాత్రం వ్యక్తం చేసింది.
ఇక్కడనే భారత్ ఎంతో సున్నితంగా వ్యవహరింప వలసిన పరిస్థితి ఏర్పడింది. నెహ్రూకాలం నుండి భారత్ అనుసరిస్తున్న ఏకూటమిలో చేరని అలీనా విధానం అనుకూలంగానే దాదాపుగా ఇప్పటివరకు వ్యవహరిస్తున్నాము. గత ఒకటిన్నర దశాబ్దకాలంగా అమెరికాతో మన సంబంధాలు మెరుగుపడుతున్నా రష్యా ప్రాధాన్యతను విస్మరించడం లేదు. మన రక్షణ పరికరాల దిగుమతిలో 70 శాతం వరకు రష్యా పైననే ఆధారపడి ఉన్నాము.
మరోవంక, మన ఆర్ధిక, వ్యూహాత్మక ప్రయోజనాల విషయంలో రాజీధోరణి అనుసరింపలేము. అయితే భారత్ ప్రపంచంలో ఆర్థికంగానే కాకుండా, రక్షణ పరంగా కూడా ఒక శక్తిగా ఎదుగుతున్న సమయంలో ప్రపంచ వ్యవహారాలలో నిబద్దత కూడా అవసరం కాగలదు.
ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఐరోపా వ్యవహారంగా భావిస్తూ చైనా, జపాన్ వంటి ప్రధాన ఆసియా దేశాలు పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. అయితే భారత్ ప్రపంచ నాయకత్వ స్థాయికి ఎదగాలనుకొంటే అది ఐరోపా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, దక్షిణ అమెరికా కావచ్చు … ప్రతిచోటా అంతర్జాతీయ వ్యవహారాలలో నిమగ్నం కావడం తప్పనిసరి కాగలదు.
నేరుగా జాతీయ ప్రయోజనాలు లేనప్పుడు అంతర్జాతీయ వ్యవహారాలలో ఆసక్తి ఎందుకనే ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తుతుంది. అయితే బ్రిక్స్ ద్వారా, భారత్ -చైనా-రష్యా కూటమి; క్వాడ్ ద్వారా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కూటమిలలో భారత్ క్రియాశీలకంగా వ్యవహరించడం గమనార్హం. ఈ విషయంలో ప్రపంచ శక్తిగా ఎదగాలనుకొంటున్న చైనా ఒక స్వతంత్ర విధానం తీసుకోగలుగుతుంది.
ఉక్రెయిన్ సంక్షోభ అంశంలో భద్రతా మండలిలో చైనా కూడా ఓటింగ్ లో పాల్గొనకపోయినా రష్యాకు మద్దతు తెలపడంతో దాపరికం వహించడం లేదు. చైనా అధ్యక్షుడు ఒక వంక రష్యా అధ్యక్షునితో టెలిఫోన్ లో మాట్లాడారు. మరోవంక, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్‌తో టెలిఫోన్ లో మాట్లాడుతూ రష్యా భద్రతా ఆందోళనలకు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
అదే సమయంలో, ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని చైనా గౌరవిస్తుందని, అది ప్రతి దేశంతో ఉండాలని కూడా ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి, తైవాన్ సార్వభౌమాధికారం విషయంలో బీజింగ్ అటువంటి ఇవ్వడం లేదు. కానీ రష్యా, ఉక్రెయిన్ విషయంలో మాత్రం తన వైఖరిని స్పష్టం చేసింది. అయితే, చైనాను ఎదుర్కోనే విషయంలో పాశ్చాత్త దేశాల మద్దతు కోల్పోవలసి వస్తుందనే సంశయం కూడా ఈ సందర్భంగా భారత్ ను వెంటాడుతున్నది.
అమెరికా అనుసరిస్తున్న ఇండో-పసిఫిక్ వ్యూహం ఖచ్చితంగా చైనాను కట్టడి చేయడానికి ఉద్దేశించినది. చైనా వ్యతిరేక కూటమికి భారతదేశం రక్షణగా ఉండాలని వాషింగ్టన్ కోరుకుంటోంది. అయితే, అలాంటి సైనిక కూటమి అంటూ ఏఈ లేదు. క్వాడ్ ఆసియా నాటో కాదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేయడం గమనార్హం.
భారతదేశం తటస్థ వైఖరిని అనుసరించడం ద్వారా రష్యా, అమెరికాలు రెండింటికి దూరం అయ్యే ప్రమాదం ఉన్నదనే వాస్తవాన్ని కూడా భారత్ విదేశాంగ నిపుణులు గుర్తిస్తున్నారు. అందుకనే, మాస్కోకు ఉన్న భయాందోళనలను భారతదేశం అర్థం చేసుకుంటుందని మన నేతలు, దౌత్యవేత్తలు రష్యన్లకు చెప్పవచ్చు. అదే విధంగా రష్యా నుండి కాదు చైనా నుండి ప్రపంచానికి అసలు ప్రమాదం అని అమెరికన్లకు స్పష్టం చేయవలసి ఉంది.
ఈ రెండు దేశాలతో ఈ విషయంలో వ్యవహరించడం ఒక విధంగా భారత్ నేతలకు సవాల్ వంటిదే. అయితే అమెరికన్లు, నాటోలోని ఐరోపా సభ్యులకు వారి, వారి ప్రాధాన్యతలు ఉన్నాయి. మన వాదనలను అర్ధం చేసుకోవడం వారికి అంత సులభం కాకపోవచ్చు.
అమెరికా చైనాను కట్టడి చేయాలని భావించినప్పటికీ, ఇండో- పసిఫిక్‌లో ఆధిపత్యం వహించడానికి భారతదేశం ఆసక్తి చూపడం లేదు. అంతటి ఆర్ధిక, సైనిక శక్తీ మనకు లేదు. కానీ చైనా-పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్-ఇరాన్ కలయికకు వ్యతిరేకంగా తనను తాను కాపాడుకోవడం కోసం అమెరికా భద్రతా వలయంలో భాగం కాక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఈ దేశాలన్నీ ఇప్పుడు అమెరికా పట్ల విముఖంగానే ఉండడం గమనార్హం. అదే భారత్ రక్షణ సంబంధ ప్రయోజనాలకు కలసివచ్చే అంశం.
సంక్లిష్టమైన ప్రపంచీకరణ ప్రపంచంలో, మనకు దూరంగా ఉన్న ఉక్రెయిన్‌లో సంక్షోభం ప్రభావాల నుండి మనం తప్పుకోలేము. కాబట్టి, , ఉక్రెయిన్‌లో ఎదురయ్యే ఎదురుగాలులు పెరుగుతున్న ముడి చమురు ధరలతో సహా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు.
అయితే ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రపంచంలో కల్లోలం ఉందని, భారతదేశం పటిష్టంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినప్పుడు ఆసక్తికర ప్రతిస్పందన వచ్చింది. కఠినమైన సమయాలు కఠినమైన నాయకుడిని పిలుస్తాయని ఆయన అన్నారు. కాబట్టి, ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి ఆందోళన చెందుతున్నట్లు స్పష్టం అవుతున్నది.
విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థతో భారతదేశం మధ్యస్థ శక్తిగా మిగిలిపోయింది. ఇఅందుకే జైశంకర్ పలు సందర్భాలలో బహుళ ధ్రువ ప్రపంచ ప్రపంచం గురించి మాట్లాడుతున్నారు. ఈ స్థానం నుండి ప్రపంచ సవాళ్లతో భారతదేశం చర్చలు జరపాలి.
1 Comment
ఇంత సునిశితమైన అంశం పై మీ విశ్లేషణ నిజంగా కొనియాడదగినది.
తత్వ న్యూస్ రిపోర్టర్ కి ధన్యవాదములు.