రాజధానిని మారుస్తూ శాసనం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని, పార్లమెంట్ మాత్రమే చేయాలని స్పష్టం చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కొంత ఇరకాటంలో పడినా, మూడు రాజధానుల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. అందుకనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ను ఆశ్రయించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
హైకోర్టు తీర్పు అమలులో రాష్ట్ర ప్రభుత్వంకు ముఖ్యంగా నిధుల సమస్య ఎదురు కానున్నది. రైతులకు ఇవ్వవలసిన ప్లాట్ లను అభివృద్ధి చేసి మూడు నెలల్లో ఇవ్వాలని, ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం హైకోర్టు నిర్మాణం జరగాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే ఇబ్బందు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టే పరిస్థితుల్లో లేదు.
మరోవంక, హైకోర్టు తీర్పును టిడిపికి `నైతిక విజయం’గా ప్రజలకు సందేశం వెడుతుందని వైసిపి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తద్వారా వచ్చే ఎన్నికలలో తాము మూల్యం చెల్లింపవలసి ఉంటుందని భావిస్తున్నారు. అందుకనే ఎన్నికల వరకు రాజధాని విషయాన్ని తేలనీయకుండా, కోర్ట్ వాయిజ్యాలతో కాలం గడపాలనే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తున్నది.
తీర్పు రాగానే, తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, మంత్రులు బత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులతో చర్చించారు. ముందుగా న్యాయ నిపుణుల సలహా తీసుకుని అనంతరమే సుప్రీంకోర్టుకు వెళ్లాలని అనుకున్నట్లు తెలిసింది. కోర్టు తీర్పు ఏమున్నా పరిపాలనా వికేంద్రీకరణ విషయంలో వెనక్కు తగ్గేది లేదని నిర్ణయించినట్లు సమాచారం.
అలాగే కోర్టుకు వెళితే ఉపయోగం ఏమిటన్న అంశంపై చర్చించినా ముందు పిటిషన్ దాఖలు చేయాలని సిఎం సూచించినట్లు తెలిసింది. అయితే కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా హైకోర్టు తీర్పుకు సంబంధించి ఆరు నెలలు కొనసాగింపు ఉన్న నేపథ్యంలో అక్కడ కోర్టు పిటిషన్పై విచారణ జరుపుతుందా? లేదా? అనే అంశంపై మాట్లాడినట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసినా అది ఫైల్ అయి విచాణరణకు స్వీకరించే లోపు ఇక్కడ ప్లాట్ల అభివృద్ధి ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కోర్టు దీన్ని పరిశీలిస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో హైకోర్టు తీర్పు, పరిశీలన ఉన్న నేపథ్యంలో ఆరు నెలలు తరువాత పరిశీలిద్దామంటే ఇప్పట్లో పిటిషన్పై విచారణ జరిగే అవకాశం ఉండదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నది. ఆరు నెలల్లో ఇక్కడ పనులు పూర్తిచేసిన తరువాత పిటిషన్ దాఖలు చేస్తే అక్కడ చట్టం అమలు జరుగుతున్నందున ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయమూ ముందుకు రావచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
కోర్ట్ తీర్పు రాగానే తమ ప్రభుత్వం మూడు రాజధానులు కట్టుబడి ఉన్నదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేయడం గమనార్హం. మరోవంక, పలువురు వైసిపి నాయకులు హైకోర్టు ఇంత తొందరగా తీర్పు ఇవ్వడం ఏమిటని కూడా ప్రశ్నిస్తూ ప్రకటనలు చేశారు. మరిన్ని ప్రధానమైన అంశాలను కోర్ట్ ముందుండగా, వారిని పరిశీలించకుండా ఈ అంశం అంత ముఖ్యమైనదా? అని విమర్శలు కురిపించారు.