కేరళ ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ మంత్రిగా, కాంగ్రెస్ లో కీలక నేతగా పలు దశాబ్దాలుగా క్రియాశీలంగా వ్యవహరిస్తున్న ఏకే ఆంటోనీ (81) ఇక తాను ఎన్నికల రాజకీయాలకు, ఢిల్లీకి దూరం కానున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు పార్టీ అధినేత సోనియా గాంధీ, కేరళ కాంగ్రెస్ కమిటీకి తెలిపారు.
ఆయన రాజ్యసభ సభ్యత్వం ఏప్రిల్ 2 నాటికి ముగుస్తుంది. తిరిగి రాజ్యసభకు ఎన్నిక కావడానికి కేరళలో కాంగ్రెస్ కు బలం ఉన్నప్పటికీ, తాను పోటీచేయబోనని స్పష్టం చేశారు. ఆ విధంగా 52 ఏళ్ళ క్రియాశీల రాజకీయాలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇక నుండి తిరువనంతపురంలోని ఉంటానని తెలిపారు.
కాంగ్రెస్ విద్యార్థి, యువజన విభాగాల నేతగా ఉంటూ 1970లో మొదటిసారిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికై ఐదు సార్లు ఎమ్యెల్యేగా పనిచేశారు. ఈ సమయంలో మూడు సార్లు కేరళ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. పదేళ్ల పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నారు. ఐదు సార్లు రాజ్యసభకు ఎన్నికైన ఆయన మూడు సార్లు కేంద్ర మంత్రివర్గంలో చేరారు. గత ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నికల రాజకీయాలకు దూరం కావాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
“కొద్దీ నెలల క్రితం రాజ్యసభకు తిరిగి ఎన్నిక కావాలి అనుకోవడం లేదని సోనియాజీకి తెలిపాను. గత నెలలో కేరళకు వెళ్ళినప్పుడు పిసిసి అధ్యక్షునికి, ఇతర పార్టీ సహచరులకు తెలిపాను. పార్టీ నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. ఇక ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండవలసిన సమయం” అని చెప్పారు.
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన, అప్పటి నుండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యునికా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ వర్గాల్లో `సెయింట్ ఆంటోనీ’ అని పిలుస్తుంటారు. నిజాయతీపరుడిగా పేరుంది. పార్టీ నాయకత్వానికి నమ్మకస్తునిగా కూడా వ్యవహరిస్తుంటారు.
2004లో ఢిల్లీకి తన మకాంను ఢిల్లీకి మార్చిన ఆయన రక్షణ మంత్రిగా, కాంగ్రెస్ కార్యవర్గ సభ్యునిగా యుపిఎ ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించిన బృందంలో ఉన్నారు. 2014 నుంచి కాంగ్రెస్ ఎన్నికలలో, సంస్థాగతంగా సంక్షోభకర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయాలలో ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు `రక్షణ కవచం’గా వ్యవహరిస్తూ వస్తున్నారు.
1976లో గౌహతిలో జరిగిన ఏఐసీసీ సమావేశాలలో యువకుడైన పిసిసి అధ్యక్షునిగా ఎమర్జెన్సీని తొలగించమని ఇందిరాగాంధీని కోరారు. 1978లో కాంగ్రెస్ లో చీలిక ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ చీకమంగళూర్ నుండి ఉపఎన్నికలో పోటీచేస్తున్న ఇందిరాగాంధీకి మద్దతు ఇస్తున్నందుకు నిరసనగా సంకీర్ణప్రభుత్వ నేతగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. శరద్ పవర్ నాయకత్వంలోని కాంగ్రెస్ (ఎస్)లో చేరారు.
అయితే ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నుండి వైదొలిగి, కాంగ్రెస్ (ఆంటోనీ) అని కేరళలో ఏర్పాటు చేసి, ఆ తర్వాత కొచ్చిలో ఇందిరాగాంధీ సమక్షంలో ఆ పార్టీని కాంగ్రెస్ (ఐ)లో విలీనం చేశారు.