ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలలో పాలుపంచుకోబోమని యూనివర్శిటీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుండి రాతపూర్వక హామీ పత్రం తీసుకోవాల్సిందిగా యూపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాంపస్ ఆవరణలో గాని లేదా వెలుపల గాని ఎటువంటి దేశ వ్యతిరేక, సామాజిక వ్యతిరేక కార్యకలాపాలలో భాగస్వాములంకామని, అలాంటి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వమని, ప్రచారం చేయబోమని సంతకం చేయించుకున్నట్లు సమాచారం.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాలను తాము అమలు చేయనున్నట్లు బెన్నెట్ యూనివర్శిటీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల మేరకు మీరు అదనపు బాధ్యతను తీసుకోవాలని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతకం చేసిన ఫారమ్‌ను జత చేయాలని ఈ నెల 14న విద్యార్థులకు పంపిన మెయిల్లో పేర్కొంది.
యుపిలోని గ్రేటర్ నొయిడాలో 2016లో ప్రారంభించడిన బెన్నెట్ యూనివర్శిటీలో 2500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. చట్ట విరుద్ధమైన సమావేశాలు, నిరసనలు, ఆందోళనలను దేశ వ్యతిరేక కార్యకలాపాలుగా పరిగణించనున్నట్లు తెలిపింది. అంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి, యుపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు, సమావేశాలు నిర్వహించకూడదన్నది ఈ ఉత్తర్వుల సారాంశం
ఇది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన తీర్మానమని, యుపి ప్రభుత్వం కింద ఉన్న అన్ని యూనివర్శిటీలకు ఇదే విధమైన ఆదేశాలు జారీ అయ్యాయని, యుపి ప్రభుత్వపు చట్టబద్ధమైన ఆదేశమని బెన్నెట్ యూనివర్శిటీ రిజిస్టార్ కల్నల్ గుల్జిత్ సింగ్ చద్దా (రిటైర్డ్) పేర్కొన్నారు.
నూతన, కొత్త, ఇప్పటికే ఉన్న ప్రైవేట్ యూనివర్శిటీలు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గనబోమని విద్యార్థుల నుండి రాతపూర్వక పత్రాలను తీసుకోవడం తప్పనిసరి అని 2019 జూన్‌లో యుపి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. జాతీయ సమైక్యత, లౌకికవాదం, సామాజిక సామరస్యం, అంతర్జాతీయ విధానం, నైతికనిర్మాణం, దేశభక్తి పెంపొందించాలని ఆదేశించింది.
విద్యార్థులు ఎవరైనా దేశ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గన్నట్లయితే వారు యూనివర్శిటీ నిబంధనలను ఉల్లంఘించినట్లవుతుంది. దీంతో ఆ విద్యార్థిపై యాజమాన్యం ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చు. తక్షణమే కాలేజీ నుండి తొలగించవచ్చు. ఆ విద్యార్థిపై చట్టబద్ధ సంస్థలకు ఫిర్యాదు చేసే హక్కు యూనివర్శిటీలకు ఉందని పేర్కొంది. ఒకవేళ విద్యార్థి అటువంటి కార్యకలాపాలలో పాల్గన్నట్లయితే వెంటనే యూనివర్శిటీ యాజమాన్యం దృష్టికి తీసుకురావల్సిందిగా ప్రొఫెసర్లకు సూచించింది.