ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ కంటే కేసీఆర్ ఎక్కువ భయపడుతున్నారని బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలు టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్ సమావేశాలుగా జరిగాయని ఆయన విమర్శలు గుప్పించారు. డబుల్ ఇంజన్‌కే నాలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దపీట వేశారని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేసుకున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఒకే గూటి పక్షులని అసెంబ్లీ సమావేశాల ద్వారా తేటతెల్లమైందని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినట్లు అసెంబ్లీలో మాట్లాడి సభను దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు.
హిజాబ్ అంశంపై కేసీఆర్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. కెసీఆర్ తన పతనాన్ని గమనించి మోదీపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కంటోన్మెంట్ ప్రాంతంలో కరెంటు, నీళ్లు కట్ చేస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించడం సిగ్గు చేటని మండిపడ్డారు.
సింగిల్ ఇంజన్ సర్కార్ వల్ల ఒక్క కుటుంబానికే మేలు అని…. తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్‌ను కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. యువత తిరగబడుతుందనే ఉద్యోగ ప్రకటనలు చేశారని చెప్పారు. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా.. గజ్వేల్‌కు ముఖ్యమంత్రా స్పష్టం చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.