ఎస్టీ రిజర్వేషన్లను పెంచడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హామీనిచ్చారు. రాష్ట్ర శాసనసభలో ఎస్టీ రిజర్వేషన్ పెంపును డిమాండ్ చేస్తూ సభ్యులు ఆందోళన చేయడంతో ముఖ్యమంత్రి స్పందించారు.
న్యాయమూర్తుల కమిటీ నివేదిక మరో 8-10 రోజులలో రానుందని తెలిపారు. ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎస్టీ రిజర్వేషన్ అంశం అత్యంత క్లిష్టమైనదని పేర్కొంటూ ప్రభుత్వం ముందు ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.
మాజీ ఉపలోకాయుక్త సుభాష్ అడి నేతృత్వంలో వివిధ సామాజిక వర్గాల రిజర్వేషన్‌తోపాటు ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన కమిటీ ఏర్పడిందని గుర్తు చేశారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌కు నివేదిక ఇవ్వాలని సూచించామని తెలిపారు.
రెండు వారాలలోగానే నివేదికలు రానున్నాయని చెప్పారు. గతంలో వాల్మీకి సామాజికవర్గీయులను వెనుకబడిన, బుడకట్టు వర్గం కింద 5శాతం రిజర్వేషన్ ఉండేది. ఎస్టీలోకి వాల్మీకులను చేర్చిన తర్వాత 3.5శాతం మాత్రమే రిజర్వేషన్ సాధ్యమవుతోంది. ఇందుకోసం 7.5శాతం రిజర్వేషన్ పెంచితే న్యాయం చేసినట్టు అవుతుందని పలువురి డిమాండ్‌గా ఉందని ముఖ్యమంత్రి వివరించారు.
ఇందిరా సహాని వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 శాతం కంటే మించి రిజర్వేషన్లు ఉండరాదనే నిబంధనలు ఉన్నా ప్రత్యేక సందర్భంలో వెసలుబాటుకు అవకాశం కోసం అడ్వకేట్ జనరల్‌కు నివేదిక ఇవ్వాలని సూచించామని బొమ్మై తెలిపారు.
రిజర్వేషన్ పెంచాలని వాల్మీకి స్వామిజీలు బెంగళూరులో చేపట్టిన నిరంతర ధర్నాను విరమించుకోవాలని శాసనసభ ద్వారా కోరుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఇదే సందర్భంలో బీజేపీ సభ్యుడు రాజుగౌడ మాట్లాడుతూ సమస్యతో సతమతమవుతున్నామని జస్టిస్ నాగమోహన్‌దాస్ నివేదికకు అనుగుణంగా అమలు చేస్తే బాగుంటుందని సీఎంను కోరారు. 49 రోజులుగా వాల్మీకి స్వామిజీలు నిరసన తెల్పుతున్న విషయమై ముఖ్యమంత్రి నేరుగా వెళ్లి స్వామీజీలతో మాట్లాడాలని సభ్యులు కోరారు.