గురువారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 13 స్థానాలకు గాను బీజేపీ 4 సీట్లు గెలుచుకోవడం ద్వారా బిజెపి మరో రికార్డు సృష్టించింది. ఆ పార్టీ చరిత్రలో మొదటిసారిగా రాజ్యసభలో తన సభ్యుల సంఖ్యను వందకు చేరుకొని, ఇప్పుడు 101 మంది సభ్యులు ఉన్నారు. స్వతంత్ర భారత దేశంలో కాంగ్రెస్ తర్వాత రాజ్యసభలో 100కు మించి సభ్యులున్న పార్టీ బిజెపి మాత్రమే కావడం విశేషం.
అదీ గాక, 34 ఏళ్ళ తర్వాత ఒక పార్టీకి రాజ్యసభ సభ్యుల సంఖ్య 100కు దాటింది. చివరిసారిగా కాంగ్రెస్ కు 1988లో రాజ్యసభలో 100కు మించి 108 మంది సభ్యులు ఉండేవారు. ఆ పార్టీకి అప్పటి వరకు పార్లమెంట్ ఉభయ సభలలో మెజారిటీ సభ్యులు ఉండేవారు. అత్యధికంగా, 1962లో 162 మంది సభ్యులు ఉండేవారు.
మూడు ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపుర, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే వరకు ఉన్న 97 సీట్లకు గాను సంఖ్య సెంచరీని క్రాస్ చేసింది. మరోవైపు.. కాంగ్రెస్‌కు ఈశాన్య రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం లేకపోవడం కూడాఇదే మొదటిసారి.
దీంతో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 29కి పడిపోయింది. ఇక, ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలోని మొత్తం ఐదు సీట్లను గెలుచుకుంది. దీంతో రాజ్యసభలో ఆప్ సంఖ్యా బలం ఎనిమిదికి పెరిగింది.
245 మంది సభ్యులున్న రాజ్యసభలో 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి బీజేపీ బలం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2014లో రాజ్యసభలో బీజేపీకి 55 మంది సభ్యులు ఉండగా.. తర్వాత అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో ఈ సంఖ్య ఇపుడు సెంచరీ మైలురాయిని అందుకుంది.
కాగా, త్వరలో మరో 52 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్ సహా రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా అవకాశం లేదు. కాబట్టి వంద మార్క్‌ను నిలుపుకోవడం కష్టమే కాగలదు. ఉత్తరప్రదేశ్‌లో ఖాళీకానున్న 11 స్థానాల్లో ఎనిమిదింటిని బీజేపీ గెలుచుకునే అవకాశముంది. యూపీ నుంచి రిటైర్ అవుతున్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో ఐదుగురు బీజేపీకి చెందిన వారు ఉన్నారు.