ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ, తాజాగా జరిగిన శాసనమండలి ఎన్నికల్లో సైతం తిరుగులేని ఆధిక్యత కనబరిచింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.
ఇక్కడ, స్వతంత్ర అభ్యర్థి అన్నపూర్ణ సింగ్.. సమీప బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్లోని లోకల్ అథారిటీ ఏరియాలోని 36 స్థానాల్లో 33 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ భారీ విజయంతో యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ సొంతమైంది.
ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీపై బీజేపీ స్పష్టమైన అధిక్యతను సంపాదించింది. ఈ ఎన్నికల్లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందారు. 36 యూపీ ఎమ్మెల్సీ స్థానాల్లో మొదటనే 9 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 27 శాసనమండలి స్థానాల్లో మొత్తం 95 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భారీ గెలుపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విటర్లో స్పందించారు. ‘నేడు.. యూపీ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ భారి విజయం సాధించింది. ఈ భారీ విజయం.. జాతీయవాదం, అభివృద్ధి, సుపరిపాలన గల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యూపీ ప్రజలు ఉన్నారని మరోసారి స్పష్టమైంది’ అని యోగి పేర్కొన్నారు.