సివిల్ కాంట్రాక్టర్ “అసహజ మరణం”పై నమోదైన కేసులో నిందితుడిగా పేర్కొన్న మూడు రోజుల తరువాత, కర్ణాటక మంత్రి కెఎస్ ఈశ్వరప్ప గత సాయంత్రం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన రాజీనామాను సమర్పించారు. కేబినెట్లో కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ మంత్రిగా ఉన్న ఈశ్వరప్ప “బిజెపికి ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి” తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర బిజెపిలో శక్తివంతమైన బిసి నాయకుడు అవినీతి, తదుపరి కాంట్రాక్టర్ ఆత్మహత్యల ఆరోపణలపై రాజీనామా చేయవలసి వచ్చింది. గత గురువారం తన రాజీనామాను ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు.రాజీనామాను ఆమోదిస్తున్నట్లు వెంటనే ముఖ్యమంత్రి ప్రకటించారు.
అయితే సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈశ్వరప్ప స్పష్టం చేశారు. పోలీసుల నుంచి ప్రాథమిక నివేదిక అందిన తర్వాత ఈశ్వరప్ప తన రాజీనామాపై తుది నిర్ణయం తీసుకుంటారని ఈ వారం ప్రారంభంలో ముఖ్యమంత్రి చెప్పారు. అయితే, పోలీసుల నివేదిక రాకముందే ఆయన రాజీనామా చేశారు.
రాజీనామా సమర్పించిన అనంతరం కేఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ.. “అది ఆత్మహత్య అయినా.. హత్య అయినా.. దీనిపై సరైన విచారణ జరగాలి. నా తప్పు కాదు. అసలు దోషిని గుర్తించి శిక్షించాలి. ఇది హత్యగా కొనసాగితే, దోషులను శిక్షించక తప్పదు. నేను ఒక్క శాతం తప్పు చేసినా నా కుటుంబ దేవత నన్ను శిక్షిస్తుంది ” అని పేర్కొన్నారు.
ఈశ్వరప్ప తన స్వగ్రామం శివమొగ్గ నుంచి బెంగళూరుకు వెళ్లే ముందు మంత్రి పదవికి రాజీనామా చేయడానికి కారణాలను కూడా చెప్పారు. పార్టీ అగ్రనేతలకు, శ్రేయోభిలాషులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఆయన పేర్కొన్నారు. తిరిగి నిర్దోషిగా నిరూపించుకొని మంత్రిపదవి చేపట్టగలనని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో బీజేపీ కార్యకర్తలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నానని చెబుతూ తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే వరకు అధికారంలో ఉండలేరన్న విషయం మిగిలిన వారికి అర్థమవుతుందని చెప్పారు.
అయితే రాజీనామా చేస్తే సరిపోదని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పష్టం చేశారు. అవినీతి నిరోధక చట్టం క్రింద కేసు నమోదు చేసి, ఈశ్వరప్పను అరెస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. “రాజీనామా పరిష్కారం కాదు. అవినీతిపై కేసు నమోదు చేయాలి, ఆపై అరెస్టు చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాల డిమాండ్ ను కొట్టిపారేస్తూ, ఈ కేసులో ప్రతిపక్షాలు విచారణ అధికారి లేదా న్యాయమూర్తి కావాల్సిన అవసరం లేదని సీఎం బొమ్మై హితవు చెప్పారు. కాంగ్రెస్ కపటత్వానికి పాల్పడుతోందని బొమ్మై ఆరోపిస్తూ, “కేజే జార్జ్ (కాంగ్రెస్ హయాంలో మంత్రి, ఆత్మహత్యకు ముందు పోలీసు అధికారి చేత నిందించబడ్డాడు) కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసిందా?” అని ప్రశ్నించారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నప్పటికీ కర్ణాటక పోలీసులు గానీ, సీబీఐ గానీ ఆయనను అరెస్టు చేయలేదని గుర్తు చేశారు. అరెస్ట్ చేయాలా వద్దా అనేది పోలీసులు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.
ఇలా ఉండగా, , కాంట్రాక్టర్ మరణం వెనుక తనను రేప్ కేసులో ఇరికించే ప్రయత్నంలో “మహానాయక్”తో సహా కొంత మంది వ్యక్తులు ఉన్నారని బిజెపి మాజీ మంత్రి రమేష్ జార్కిహోలి ఆరోపించారు.
“నేను సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తాను. సంతోష్ పాటిల్ మరణానికి ముందు ఏమి జరిగిందో వివరాలను వెల్లడిస్తాను. నా కేసులో ప్రమేయం ఉన్న టీమ్‌నే ఈశ్వరప్పపై కుట్రకు పాల్పడ్డారు. మేము పార్టీ హైకమాండ్‌తో చర్చించి మాట్లాడుతాము,” అని బిజెపి ఎమ్మెల్యే పాటిల్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత బెలగావిలో చెప్పారు.