అంతర్జాతీయంగా ప్రసిద్ధిచెందిన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. రాష్ట్రపతి సాహిత్య, సంగీత, ఆర్ధిక, వైజ్ఞానిక రంగాలకు సంబంధించిన ప్రముఖులను రాజ్యసభకు నేరుగా నామినేట్ చేయవచ్చు. ఇందులో భాగంగానే రాష్ట్రపతి రాజ్యసభ సభ్యులుగా 12 మందిని నామినేట్ చేయనున్నారు.
ఈ కోటా కిందే ఆరేళ్ళ క్రితం డా. సుబ్రమణ్య స్వామిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యసభకు పంపింది. ఆయన పదవీకాలం ముగియనుండటంతో, ఆ స్థానంలో ఇప్పుడు ఇళయరాజాను నామినేట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
నిజానికి ఇలా వార్తలు రావడానికి ఓ ప్రత్యేక కారణమే ఉంది. ఇళయరాజా ఇటీవల ‘అంబేడ్కర్- మోదీ రిఫార్మర్స్ ఐడియాస్ అండ్ పర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్’ అనే గ్రంధానికి ముందు మాట రాశారు. అందులో అంబేద్కర్ ఆశయాలను ప్రధాని మోదీ నెరవేరుస్తున్నారని ఇళయరాజా కొనియాడారు.
అంబేద్కర్ నేడు జీవించి ఉంటె మోదీ పరిపాలన చూసి ఎంతో సంతోషించేవారని కూడా చెప్పారు. ఇద్దరు పేదరికం, వివక్షత వంటి దాదాపు ఒకే నేపధ్యం నుండి ప్రజాజీవనంలోకి వచ్చారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి.
ఇటువంటి దుమారం రేగిన రెండు రోజులకే ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయబోతున్నట్లు వార్తలు రావడం ఆసక్తి కలిగిస్తున్నాయి. అయితే ఈ విషయమై అటు కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ, ఇటు రాష్ట్రపతి కార్యాలయం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో ఈ విషయంపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది.
తమిళనాడులో జయలలిత మరణం అనంతరం ఏర్పడిన `రాజకీయ సూన్యత’ను ఆసరాగా చేసుకొని పాగా వేయాలని బిజెపి ఎంతగానో ప్రయత్నిస్తూ వచ్చింది. మొదట్లో అన్నాడీఎంకే లోని వర్గాలను కలిపి, వారే అధికారంలో ఉండేటట్లు చేసి, తెరవెనుక ఉంది రాజకీయాలు నడిపించింది. గత అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే జైలు శిక్ష పూర్తి చేసుకు వచ్చిన శశికళ సొంత పార్టీ గురించి ఆలోచిస్తుండగా,ఆ విధంగా చేస్తే డీఎంకేకు ప్రయోజనం కాగలదని ఆమె మౌనం వహించేటట్లు చేశారు.
రజనీకాంత్ ను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా గాని, సొంత పార్టీ ప్రారంభించేటట్లు చేయడం ద్వారా గాని తమిళనాడు రాజకీయాలలో పట్టు సాధించాలనే బిజెపి ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు ఆయనను రాజ్యసభకు పంపి, ఆయన సహాయంతో ఆ రాష్ట్రంలో పాగావేసే ప్రయత్నాలు కూడా కలిసిరాలేదు. ఇప్పుడు డీఎంకే రోజురోజుకు బలపడుతూ రావడం బిజెపికి ఆందోళన కలిగిస్తున్నది.
ఇటువంటి సమయంలో కర్ణాటకలో వలె సంగీత దర్శకుడిగా ఎంతో ప్రజాభిమానం కూడదీసుకున్న ఇళయరాజా స్వయంగా ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తడంతో బిజెపి వారి దృష్టి ఆయనపై పడినదని పలువురు భావిస్తున్నారు. అయితే బలమైన నాయకత్వం లేని ఆ రాష్ట్రంలో ఇటువంటి ప్రయత్నాలు రాజకీయంగా ఏమేరకు ఫలిస్తాయో చూడవలసిందే.
ఇలా ఉండగా, తమిళనాడులోని తిరుమావళవన్ సహా రాజకీయ నేతలంతా ఇళయరాజా వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయనపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ సంగీత స్వరకర్త ఇళయరాజా చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా తెలంగాణ, పాండిచ్చేరి గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ద్వేషపూరిత రాజకీయాలకు బీజం వేసే వారు ప్రధాని మోదీని అంబేద్కర్‌తో పోల్చినందుకు ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు ఇళయరాజా ఇలాంటి పరుష పదజాలాన్ని ఎదుర్కోవడం సరైనదేనా? అని తమిళిసై సౌందరరాజన్‌ను ట్విట్టర్లో ప్రశ్నించారు.
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ కూడా ఇళయరాజాపై ద్వేషపూరిత ప్రసంగాన్ని ఖండించారు. “ఇళయరాజా సార్ నేరం ఏమిటి? డీఎంకేకు, వారి అహంకార వ్యవస్థకు నచ్చని దృక్పథం ఆయనకు ఉందని ఆయనను వ్యతిరేకిస్తున్నారా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై తాను మాట్లాడనని ఇళయరాజా స్పష్టం చేసిన్నట్లు ఆయన సోదరుడు గంగై అమరన్ తెలిపారు. తన వ్యాఖ్యలను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోనని తనతో ఇళయరాజా అన్నారని ఆయన తెలిపారు. “నేను ఒక సినిమా కోసం కంపోజ్ చేసిన ట్యూన్‌ను ఎవరైనా ఇష్టపడకుంటే.. అయినా నేను దానిని ఎప్పటికీ వెనక్కి తీసుకోను” అని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.
అదేవిధంగా ప్రధాని మోదీపై వ్యాఖ్యలను సహితం ఎప్పటికీ వెనక్కి తీసుకోరని ఇళయరాజా సోదరుడు తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్ట్ లను చూపించేందుకు వెళ్లగా వాటిని చూడడానికి కూడా ఆయన అంగీకరించలేదని చెప్పారు. ‘‘పేదల సంక్షేమం కోసం ప్రధాని మోదీ అనేక పథకాలు తీసుకొచ్చారు. నేను పుస్తకాన్ని చదివాను. నా ఆలోచనలను మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నేనెందుకు చింతించాలి? ప్రతి ఒక్కరికీ తమ స్వంత అభిప్రాయాన్ని కలిగి ఉండే హక్కు ఉంది ” అని ఇళయరాజా తనతో అన్నట్టు గంగై అమరన్ వెల్లడించారు.