అస్సాంలోని నాగావ్ జిల్లా, బటర్‌డ్రబ పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టిన కేసులో అనుమానితుల ఇళ్ళను జిల్లా అధికారులు కూల్చేశారు. కస్టడీలో ఓ వ్యక్తి మరణించినట్లు ఆరోపిస్తూ కొందరు ఈ పోలీస్ స్టేషన్‌ను శనివారం తగులబెట్టారు. ఈ సంఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.
ఈ హింసాకాండలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురి ఇళ్ళను జిల్లా అధికారులు ఆదివారం బుల్డోజర్లతో కూల్చేశారు. ఆక్రమించుకున్న భూమిలో ఈ ఇళ్ళను నిర్మించారని పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టిన కేసులో పోలీసులు దాదాపు 21 మందిని అరెస్టు చేశారు.
కస్టడీలో ఓ వ్యక్తి మరణించినట్లు వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. అస్సాం పోలీసు స్పెషల్ డైరెక్టర్ జనరల్ (శాంతిభద్రతల విభాగం) జీపీ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టిన కేసుపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా కస్టడీలో ఓ వ్యక్తి మరణించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టడానికి వచ్చినవారిలో చాలా మంది ఫోర్జరీ చేసిన పట్టాల ద్వారా కొనుగోలు చేసిన ఆక్రమిత భూమిలో ఇళ్ళు, గుడిసెలు నిర్మించుకున్నారని, వాటిలో కొన్నిటిని కూల్చి వేశామని చెప్పారు. పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టినవారికి జిహాదీ శక్తులతో సంబంధాలు ఉన్నాయేమో దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.
వీరు కేసుల రికార్డులు, ఆయుధాలను భద్రపరిచే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని చెప్పారు. తగిన సాక్ష్యాధారాలు దొరికితే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం కేసులను నమోదు చేస్తామని తెలిపారు. మరణించిన వ్యక్తి అంతకుముందు రోడ్డుపై తాగిన మైకంలో కనిపించాడని, ఆయనను పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారని మరో పోలీసు ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు.
ఇదిలావుండగా, స్థానికుల కథనం ప్రకారం మృతుడు చేపలు అమ్ముతారని, రూ.10,000, ఓ బాతును ఇవ్వాలని ఆయనను పోలీసులు అడిగారని తెలుస్తోంది. పోలీసుల డిమాండ్‌ను నెరవేర్చలేకపోవడంతో ఆ వ్యక్తిని కస్టడీలో కొట్టినట్లు తెలుస్తోంది.
ఆ వ్యక్తిని కలిసేందుకు ఆయన బంధువులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, ఆయన అస్వస్థుడయ్యాడని, ఆసుపత్రిలో చేర్పించామని పోలీసులు చెప్పారని తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్ళగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు చెప్పినట్లు సమాచారం. అనంతరం ఆయన బంధువులు ఆ మృతదేహాన్ని తీసుకుని, పోలీస్ స్టేషన్‌కు వెళ్ళారు. ఆగ్రహంతో పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టారు.