`పెద్దల సభ’గా భావించే రాజ్యసభకు ఒకప్పుడు వివిధ రంగాల్లో నిష్ణాతులు, రాజకీయంగా అనుభవజ్ఞులైన వారిని ఎంపిక చేసే వారు. అయితే రానురాను రాజకీయ పార్టీలు వివిధ కారణాల వల్ల పార్టీలోని నేతలకు, లేదా పలుకుబడి కలిగిన వారికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించడం మొదలు పెట్టాయి. దీంతో ఇప్పడు రాజ్యసభలో కూడా రాజకీయ నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు.
రాజ్యసభ సిట్టింగ్ ఎంపిలలో 39 మందిపై ప్రకటించిన క్రిమినల్ కేసులు ఉన్నాయని, అలాగే వారి సగటు ఆస్తుల విలువ రూ.79.54 కోట్లుగా ఉందని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్( ఎడిఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ కలిసి రూపొందించిన నివేదిక వెల్లడించింది. రాజ్యసభలోని మొత్త 233 మంది సభ్యుల్లో 222 మంది సభ్యులు ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన నేరాలు, ఆర్థిక స్థితిగతులు, ఇతర వివరాలను ఈ సంస్థలు విశ్లేషించాయి.
ప్రస్తుత రాజ్యసభలో ఒక స్థానం ఖాళీగా ఉండగా, ఇద్దరు సభ్యుల అఫిడవిట్లు అందుబాటులో లేకపోవడంతో విశ్లేషించలేదని, జమ్మూ, కశ్మీర్‌కు చెందిన నాలుగు స్థానాలను ఇంకా నిర్ధారించలేదని ఆ నివేదిక తెలిపింది. రాజ్యసభలోని మొత్తం 226 మంది సిట్టింగ్ ఎంపిలలో 197 మంది (అంటే 86 శాతం మంది) కోటీశ్వరులని, ప్రతి ఎంపి సగటు ఆస్తి రూ.74.54 కోట్లని ఆ నివేదిక తెలిపింది.
మొత్తం సభ్యులో 71 మంది(31 శాతం) తమపై క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించగా,37 మందిపై (16 శాతం) హత్య, అత్యాచారం లాంటి తీవ్రనేరాలకు సంబంధించిన కేసులున్నాయి. ఇద్దరు ఎంపిలు తమపై హత్యకు సంబంధించిన (ఐపిసి సెక్షన్ 302) కేసులున్నట్లు పేర్కొనగా, మరో నలుగురు ఎంపిలు హత్యాయత్నం (ఐపిసి సెక్షన్ 307)కు సంబంధించిన కేసులున్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారు.
ఇక నలుగురు ఎంపిలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులుండగా, రాజస్థాన్‌నుంచి కాంగ్రెస్ ఎంపి అయిన కెసి వేణుగోపాల్‌పై ఏకంగా అత్యచారానికి సంబంధించిన (ఐపిసి సెక్షన్ 307) కేసు ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది.
రాజ్యసభలోని 85 మంది బిజెపి సభ్యుల్లో 20 మంది (24 శాతం), కాంగ్రెస్‌కు చెందిన 31 మంది సభ్యుల్లో 12 మంది, 13 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపిల్లో ముగ్గురు, ఆర్జెడికి చెందిన ఆరుగురిలో ఐదుగురు, ఐదుగురు సిపిఎం సభ్యుల్లో నలుగురు, 10 మంది ఆప్ సభ్యుల్లో ముగ్గురు, 9 మంది వైసిపి ఎంపిల్లో ముగ్గురు, ఎన్‌సిపికి చెందిన నలుగురిలో ఇద్దరు ఎంపిలపైన క్రిమినల్ కేసులున్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారని ఆ నివేదిక వివరించింది.
కాగా బిజెపి ఎంపిల్లో 9 మంది, కాంగ్రెస్ ఎంపిల్లో 8 మంది, ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎంపి, ముగ్గురు ఆర్జెడి ఎంపిలపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులునట్లు కూడా నివేదిక తెలిపింది. ఇక రాష్ట్రాల వారీగా చూసినట్లయితే మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలకు చెందిన ఎంపిలలో అత్యధిక శాతం క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన 19 మందిలో 12 మంది (63 శాతం), బీహార్‌కు చెందిన 16మందిలో 10 మందిపైన క్రిమినల్ కేసులున్నాయి.