మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే బలపరీక్షలో విజయం సాధించడంతో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవిఎ) కూటమి ప్రశ్నార్ధకంగా మారింది. థాకరేతో ఎన్సీపీ, కాంగ్రెస్ ఇంకెంతకాలం కొనసాగుతారో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మొన్నటివరకు మిత్రపక్షాలు శివసేన, ఎన్సీపీతో అధికారాన్ని పంచుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు షిండే సీఎం అయ్యాక మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ కూటమి నుంచి బయటకు కావాలనుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి.
2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మిత్రపక్షం బీజేపీ తెగదెంపులు చేసుకున్న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో జట్టు కట్టి మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రెండున్నరేళ్ల పాటు సీఎంగా కొనసాగారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఠాక్రేకు ఏక్నాథ్ షిండే షాక్ ఇచ్చారు.
బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గతవారమే సీఎంగా బాధ్యతలు చెప్పారు. మహావికాస్ అఘాడీ నుంచి కాంగ్రెస్ విడిపోతుందనే వార్తలు బయటకు రాగానే బీజేపీ ఎంపీ వినయ్ సహస్రబుద్ధె ఎంవీఏపై విమర్శలతో విరుచుకుపడ్డారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి కేవలం అధికార దాహంతోనే ఏర్పడిందని ఆరోపించారు. ఇప్పుడు అధికారం కోల్పోవడం వల్ల కూటమిలోని పార్టీలు ఆలోచనలో పడ్డాయని ధ్వజమెత్తారు.
మరోవంక, మొన్నటి వరకు ఉపముఖ్యమంత్రిగా ఉన్న ఎన్సీపీ నేత అజిత్ పవార్ ను ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహితం షిండే ప్రభుత్వం పట్ల కఠినంగా మాట్లాడటం లేదు. అయితే అంతర్గత కుమ్ములాటలతో ఆరునెలల్లోనే కూలిపోయి, మధ్యంతర ఎన్నికలకు దారితీస్తుందని జోస్యం చెప్పారు.
ఇంతకాలం తాను శివసేనతో అన్యాయానికి గురయ్యానని అంటూ షిండే అసెంబీలో నేరుగా ఉద్ధవ్ పై విరుచుకు పడ్డారు. గతంలో బిజెపి-శివసేన ప్రభుత్వంలో త్వరలో తాను ఉప ముఖ్యమంత్రి కాబోతున్నానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తనతో చెప్పారని అంటూ పరోక్షంగా తన ఎదుగుదలకు థాకరే అడ్డుపడిన్నట్లు ఆరోపించారు.
అంతేకాదు, గత కూటమిలో తనను ముఖ్యమంత్రి చేయడానికి ఎన్సీపీ, కాంగ్రెస్ అభ్యంతరం చెప్పాయని ఉద్ధవ్ వ్యాఖ్యలను సహితం తప్పుబట్టారు. తనను ముఖ్యమంత్రి కావడాన్ని తాము ఎప్పుడు వ్యతిరేకించలేదని అజిత్ పవార్ తనతో చెప్పారని వెల్లడించారు. ఏదేమైనా, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనను ఏకాకి చేయడం ద్వారా రాజకీయంగా కనుమరుగు చేయడం కోసం షిండే వర్గం, బిజెపి లకు పరోక్షంగా కాంగ్రెస్, ఎన్సీపీ సహకారం అందివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్ధం అవుతున్నది.