ఒక వంక దేశంలో ఒమిక్రాన్ కేసులు 126కు చేరగా, వీటి కారణంగా భారత్ లో జనవరి మొదటి వారంలో మూడో వేవ్ ప్రారంభం కావొచ్చని నేషనల్ కొవిడ్ సూపర్ మోడల్ కమిటీ అంచనా వేసింది. కరోనా కేసులు ఫిబ్రవరి చివరి వారంలో గరిష్ఠ స్థాయికి వెళ్లవచ్చని పేర్కొన్నది. అయితే రెండో వేవ్‌తో పోల్చితే ఇది అంత ప్రమాదకరం కాకపోవచ్చని తెలిపింది.
డెల్టా వేరియంట్ సమయంలో చాలామంది కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని గుర్తు చేసింది. ‘దేశంలో వ్యాక్సినేషన్ మార్చిలో ప్రారంభమైంది. డెల్టా వేరియంట్ వచ్చేటప్పటికి చాలామంది వ్యాక్సిన్ వేసుకోలేదు. దీంతో ఉద్ధృతంగా వ్యాపించింది. ప్రస్తుతం భారత్‌లో సీరో పాజిటివిటీ రేటు 75-80 శాతం మధ్యలో ఉంది.
వైరస్‌ను ఎదుర్కొనేందుకు సహజ నిరోధకత ఉంది. 85% మంది ఒక్క డోసు టీకా వేసుకొన్నారు. సగం మంది రెండు డోసులు వేసుకొన్నారు. ఎంత పరిస్థితి చేయిదాటిపోయిందని అనుకొన్నా రోజువారీ కేసులు 2 లక్షలు దాటవు’ అని కమిటీ హెడ్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ విద్యాసాగర్ తెలిపారు.
వైరస్ వ్యాప్తిపై అంచనాల కోసం కేంద్రం నేషనల్ కొవిడ్ సూపర్ మోడల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ తదితరులు ఉన్నారు.యూకేలో కేసుల ఉద్ధృతిని బట్టి భారతదేశంలో వైరస్ వ్యాప్తిని పోల్చి చూడలేమని విద్యాసాగర్ చెప్పారు.
కాగా, మానవ జాతికి ప్రమాదకరమైన వైరస్‌లపై అధ్యయనం చేసేందుకు త్వరలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ కొత్త ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అధికారులు పేర్కొన్నారు.
ప్రమాదకరమైన వైరస్లు, మానవులపై వాటి ప్రభావం, వాటి నుంచి ఏవిధంగా రక్షణ పొందాలనే దానిపై ఈ అడ్వాన్స్డ్ బయలాజికల్ డిఫెన్స్ రిసెర్చ్ సెంటర్ దృష్టి సారిస్తుందని సంస్థ డైరెక్టర్ మన్మోహన్ పరీదా తెలిపారు. భారత్‌ను స్వావలంబనగా మార్చేందుకు డిఫెన్స్ ల్యాబ్‌లు కృషి చేస్తున్నాయని చెప్పారు.