ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని టీఆర్ఎస్ సర్కార్ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె.లక్ష్మణ్ ఆరోపించారు. మూతపడిన రామగుండం ఫెర్టిలైజర్ ను మోదీ ప్రభుత్వం పునరుద్ధరిస్తే అందులోని ఉద్యోగాలు స్థానికులకు దక్కకుండా టీఆర్ఎస్ నాయకులు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.
మంచిర్యాల జిల్లాలో పర్యటించిన డా. .లక్ష్మణ్. ‘‘ప్రజా గోస – బిజెపి భరోసా’’ కార్యక్రమంలో భాగంగా నస్పూర్ లో బైక్ ర్యాలీలో పాల్గొని, హమాలీవాడలో బిజెపి జెండాను ఎగరేశారు. ఎన్టీఆర్ నగర్ లో వరద బాధితులను పరామర్శించారు. ఐబీ చౌరస్తా వద్ద బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన పౌరసన్మానంలో ప్రసంగిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుతో మంచిర్యాలకు ఒక్క ఎకరాకు అదనంగా నీరు రాలేదని, కానీ వరదల్లో మాత్రం ఈ చుట్టుపక్క ప్రాంతాలు మునిగిపోయాయని వాపోయారు. వరదలో నష్టపోయిన రైతులను కేసీఆర్ పరామర్శించిన పాపాన పోలేదని మండిపడ్డారు. సింగరేణిలో సుమారు 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారని, జాతీయ వేతన ఒప్పందంలో భాగంగా వీరి వేతనాలు పెంచాలని కానీ టీఆర్ఎస్ సర్కార్ వీరి శ్రమను దోచుకుంటుందని విమర్శించారు.
ఫలితంగా ప్రతి కార్మికుడు రు.9వేల నుండి రు.14వేల వరకు నష్టపోతున్నారని ఆయన చెప్పారు. గని ప్రమాదంలో మరణించిన కాంట్రాక్టు కార్మికులకు నష్టపరిహారం విషయంలో కూడా అన్యాయం టీఆర్ఎస్ సర్కార్ అన్యాయం చేస్తుందని చెప్పారు.
ఎన్నికలు వస్తే కేసీఆర్ హామీల వర్షం మొదలవుతుందని, ఎన్నికల ముగియగానే ఆ హామీలు అటకెక్కుతాయని ఎద్దేవా చేశారు. 2017 బొగ్గుగని కార్మిక సంఘం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను కేసీఆర్ ఇప్పటికీ నెరవేర్చకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కార్మికులు తమ చెమటతో, రక్తంతో సింగరేణిని లాభాల బాట పట్టిస్తుంటే… కేసీఆర్ అప్పుల్లో ముంచుతున్నారని విమర్శించారు. కేసీఆర్ చర్యలతో దేశానికి వెలుగులు నింపుతున్న సింగరేణి కార్మికుల జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయని దుయ్యబట్టారు.
సింగరేణి భూముల్లో కార్మికులు నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు ఇస్తామని కేసీఆర్ 2018లో సింగరేణి ఆత్మీయ సమ్మేళనంలో హామీ ఇచ్చారని లక్ష్మణ్ గుర్తు చేశారు. ఈ హామీ నెరవేరిస్తే సుమారు 30 వేల మంది కార్మికులు లబ్ధి పొందుతారని, కానీ 2వేల మందికి పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు.
సింగరేణి సమీప గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఖనిజాభివృద్ధి సంస్థ సుమారు రూ.2వేల కోట్లు ఆరు జిల్లాల కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేసినా, ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదని, కేసీఆర్ ఆ నిధులను ఇతర పథకాలకు మళ్లించారని లక్ష్మణ్ ఆరోపించారు.
మంచిర్యాల చుట్టుపక్కల గిరిజన గ్రామాల్లో కనీస వసతులు రోడ్డు, రవాణా సౌకర్యాలు లేక ఎంతో మంది గర్భిణులు సకాలంలో వైద్యం అందక మరణించారని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 150కి పైగా గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యం లేదని తెలిపారు.