టీఆర్ఎస్ పార్టీ లోని చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు బీజీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వారంతా సమయం కోసం ఎదురుచూస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె. లక్ష్మణ్ వెల్లడించారు.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావాలన్నా, లేదా పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగాలన్నా అది ఎన్నికల కమీషన్ నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పారు. తెలంగాణ బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవన్న ఆయన పాదయాత్రతో పాటు, ప్రజా గోసా, బీజేపీ భరోసా యాత్రల ద్వారా ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం పై జాతీయ నాయకత్వం నిర్ణయిస్తోందని లక్ష్మణ్ వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ లో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బిజెపిదే అధికారమని స్పష్టం చేశారు.
అలాగే కేసీఆర్ జాతీయ పార్టీ ఫై ప్రశ్నించగా, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని తెలిపారు. దక్షిణాదిలో కర్ణాటక తరువాత తెలంగాణలోనే అధికారంలోకి వస్తామని చెప్పారు. బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడుగా నియమించడమే కేంద్ర మంత్రి పదవిగా భావిస్తున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుండి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తర్వాత పార్లమెంటరీ బోర్డు సభ్యుడుగా నియమితులైన రెండో వ్యక్తిని తానే అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఏపీలో అభివృద్ధి శూన్యం
ఏపీలో జగన్ ప్రభుత్వం గురించి ప్రస్తావిస్తూ సంక్షేమం ఒక్కటే ఉంటే సరిపోదని, అభివృద్ధి కూడా ముఖ్యమని డా. లక్ష్మణ్ తెలిపారు. ఏపీలో అభివృద్ధి శూన్యమని పేర్కొంటూ, అక్కడ వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేన కూటమేనని స్పష్టం చేశారు. ఏపీలో జనసేన పార్టీతో కలసి ఎన్నికలకు వెళ్తామని చెబుతూ టీడీపీతో పొత్తు ప్రస్తావన లేదని తేల్చి చెప్పారు.
కాగా, బలహీనవర్గాల సంక్షేమానికి ప్రధాని మోదీ పెద్దపీట వేస్తున్నారని లక్ష్మణ్ చెప్పారు. ముషీరాబాద్ జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన నమో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభిస్తూ ప్రధాని దేశవ్యాప్తంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని మరో మూడు నెలలు పొడిగించినట్లు తెలిపారు.
కేబినెట్లో బలహీన వర్గాలకు చెందిన 27మందికి మంత్రులుగా అవకాశం కల్పించిన ఘనత మోదీకే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మెడికల్ సీట్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించారని లక్ష్మణ్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా బీజేపీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. మోదీ జీవిత చరిత్ర, అభివృద్ధి కార్యక్రమాలు అందరికి తెలిసేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ 2న ఖాదీ మేళా పేరుతో చేనేత కార్మికుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.