నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో రెండు నెలలుగా రాజకీయంగా తెలంగాణాలో ఉద్రిక్తలు కలిగిస్తున్న మునుగోడు ఉపఎన్నికలో తమ ప్రభావం కాపాడుకోవడం కోసం మూడు ప్రధాన పార్టీలు హోరాహోరాగా ఎత్తుగడలు ప్రారంభించాయి. తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తూ అమీతుమీ తేల్చుకునే రీతిలో పోటీ చేస్తుండడం ఉత్కంఠ రేపుతోంది.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తరపున బరిలోకి దిగారు. తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని ఎన్నిక బరిలో నిలిపింది. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా మారుతున్న కీలక తరుణంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బీఫాం ఇచ్చి ఉప ఎన్నిక బరిలోకి దింపింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు సోమవారం తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ జరుగనున్న దృష్ట్యా ఈ ఎన్నిక ఫలితం తమ రాజకీయ భవిష్యత్ ను నిర్ధేశిస్తుందని మూడు పాటు పార్టీలు భారీ కసరత్తు చేస్తున్నాయి . అందుకనే కేవలం పోటీ చేస్తున్న అభ్యర్థులకు మాత్రమే కాకుండా ఈ మూడు ప్రధాన పార్టీల రాష్ట్ర నాయకత్వాలు సహితం పెను సవాల్ గా మారాయి. ఓ విధంగా వారి నాయకత్వంపై ఓ రెఫరెండం గా ఫలితం మారే అవకాశం ఉంది.
ఈ మూడు పార్టీలతో పాటు బీఎస్పీ, ప్రజాశాంతి పార్టీ, కోదండరాం వంటి వారు సహితం తమ అభ్యర్థులను పోటీకి దింపి తమ రాజకీయ ఉనికి చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ప్రధాన పార్టీలు నెలరోజుల నుండే ప్రచారంలో మునిగిపోయి ఉన్నాయి.
వామపక్షాలు టిఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం ద్వారా వచ్చే అసెంబ్లీలో అయినా తమకు నామమాత్రపు ప్రాతినిధ్యం సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నాయి. టీడీపీ, జనసేన, వైస్సార్ టీపీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.
మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2లక్షల 20వేల వరకు ఉండగా ఇప్పటి వరకు ఇక్కడ లెఫ్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలిచాయి. ఇందులో టిఆర్ఎస్, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయగా, బీజేపి మాత్రం టిడిపితో పొత్తు పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటిచేసి 12 వేల ఓట్లు సాధించింది. తెలుగుదేశం పార్టీకి కొంత ఓటు బ్యాంకు ఉండగా వారి ఓట్లు ఎటువైపు మళ్లుతాయో అంచనా వేయలేని పరిస్థితి ఉంది.
ఈసారి బీజేపీ గుర్తుతో రాజగోపాల్ రెడ్డి ఒంటరిగానే బరిలోకి దిగుతుండటం, గతంలో కంటే బీజేపీకి సానుకూలత పెరగడం, వరుస ఉప ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయాలు, అధికార గులాబీ పార్టీ వైఫల్యాలు లాంటి కారణాలు బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయితే ఇది కాంగ్రెస్ సీటు కావడంతో వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీజేపీకి పెద్ద సవాల్ గా మారిందని, మరోవైపు ఈసారి కూడా టీఆర్ఎస్ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.
ఇలా ఉండగా, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. దుబ్బాకలో బీజేపీ గెలుపు కారణంగా సీఎం కేసీఆర్ వద్ద తమ విలువ పెరిగిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుకున్నారని చెప్పారు. హుజూరాబాద్‌లో ఈటల గెలుపుతో ప్రగతి భవన్ గేట్లను ఓపెన్ చేశారని, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే తమను పేరు పెట్టి పిలుస్తారన్న భావనకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చారని పేర్కొన్నారు.