ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంతి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ (82) కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. వారం రోజులుగా ఆయనను ఐసీయూలో ఉంచి, చికిత్స అందిస్తున్నారు.
ములాయం మరణవార్తను ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ములాయం మూడుసార్లు పని చేశారు. అలాగే కేంద్రంలో రక్షణ మంత్రిగానూ సేవలందించారు. 1967లో యూపీ శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. 1939, నవంబర్ 22న ఆయన జన్మనించారు.
గత పార్లమెంట్ ఎన్నికలలో ముణిపురి నుంచి ఎంపిగా గెలిచారు. అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అక్టోబర్ 2న ఆస్పత్రిలో చేరారు.
ఎస్ పి కార్యకర్తలు ములాయం సింగ్ ను ముద్దుగా నేతాజీ అని పిలుచుకునేవారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేతగా దేశ రాజకీయాలపై చెరగని ముద్రవేశారు. రాం మనోహర్ లోహియా వంటి మహానేతల మార్గదర్శకత్వంలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ఆయన.. ఉత్తరప్రదేశ్ ప్రజలు ‘నేతాజీ’ అని పిలుచుకునేంత ఖ్యాతిని ఆర్జించారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు.
సుదీర్ఘకాలం పాటు యూపీకి సీఎంగా సేవలందించారు. అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో 19 నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. రాజకీయ జీవితంలో పది సార్లు ఎమ్మెల్యేగా, ఐదు సార్లు ఎంపీగా గెలుపొందారు. 1977లో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1980లో యూపీలోని లోక్‌దళ్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు.
1989లో తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 1993లో రెండోసారి, 2003లో మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
1996లో మొయిన్‌పురి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై.. యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. ములాయంసింగ్ యాదవ్ ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు. 1992లో సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు.