టీడీపీ మాజీ మహిళా నేత, సినీ నటి దివ్యవాణి త్వరలో బిజెపిలో చేరబోతున్నట్లు తెలుస్తున్నది. కొద్దీ రోజులగా తెలంగాణ రాజకీయాల్లో వలసల పర్వం నడుస్తుంది. సినీ తారలతో పాటు ఇతర పార్టీ నేతలు బిజెపి తీర్థం పుచ్చుకుంటున్నారు. బిజెపి అధిష్టానం సైతం సినీ స్టార్స్ ఫై కూడా ఫోకస్ చేసింది.
ఇప్పటికే సినీ స్టార్స్ జీవిత రాజశేఖర్ , విజయశాంతి తో పాటు పలువురు పార్టీలో ఉన్నారు. కాగా..ఇక ఇప్పుడు టీడీపీ మాజీ మహిళా నేత దివ్యవాణి సైతం బిజెపి లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
కొద్దిరోజుల క్రితం బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను దివ్యవాణి కలిశారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరాల్సిందిగా దివ్యవాణిని ఈటల ఆహ్వానించారు. దీంతో బీజేపీలో చేరేందుకు ఆమె సిద్దమైనట్లు అప్పట్లో జోరుగా వార్తలు వినిపించాయి.
తాజాగా ఆమె బీజేపీ ఎంపీ, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె . లక్ష్మణ్‌ను కలవడంతో దివ్యవాణి బీజేపీలో చేరిక త్వరలోనే ఉంటుందని అంటున్నారు. దీనిపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఇక దివ్యవాణి విషయానికి వస్తే..తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న దివ్యవాణి, ఆ తర్వాత రాజకీయ ప్రవేశం చేసారు. 2019 ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు.
టీడీపీ అధికారి ప్రతినిధిగా సీఎం జగన్‌కు వ్యతిరేకంగా తన వ్యాఖ్యలతో మంట పుట్టించారు. ఏపీలో రోజాకు పోటీగా ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ గత ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ అధికారాన్ని కోల్పోవడం, పార్టీలోనూ ఆమెకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కొద్ది నెలల క్రితం టీడీపీకి రాజీనామా చేశారు.