తమిళనాడు కోయంబత్తూర్ నగరంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో ఉగ్రలింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేలుడుకు ముందు కారులో గ్యాస్ సిలిండర్ పెట్టడానికి ముబిన్ అనే వ్యక్తి ఇంటి నుంచి సిలిండర్ తీసుకుని వస్తున్న నలుగురు యువకుల వీడియోలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
కోయంబత్తూర్ ఉక్కడంలోని దేవాలయం సమీపంలో ఆదివారం ఎల్పీజీ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. అయితే ఈ పేలుడుపై తమిళనాడు పోలీసులు విచారణ ప్రారంభించారు. పేలుడుకు రసాయనాలు వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో జమేషా ముబిన్ (25) మరణించాడు.
గతంతో 2019లో ముబిన్ను ఎన్ఐఏ విచారించింది. ముబిన్ ఇంటిలో పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పౌడర్, బొగ్గు, సల్ఫర్, నాటు బాంబుల తయారీకి అవసరమయ్యే పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముబిన్ ఇంటిలో పూర్తిస్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు.
తమిళనాడు డీజీపి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే మరో నలుగురు యువకులు ఎవరనేది తెల్చే పనిలో ఉన్నారు పోలీసులు. 1998 ఫిబ్రవరి 14న కోయంబత్తూర్ వరస బాంబుదాడులతో ఉలిక్కిపడింది. మొత్తం 11 ప్రాంతాల్లో 12 పేలుళ్లు సంభవించాయి. 58 మంది మరణించగా, 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎల్ కె అద్వానీని టార్గెట్ చేస్తూ ఈ దాడుల చేసేందుకు ఉగ్రవాదులు ఈ బాంబు దాడులు చేశారు.