ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి, దివంగత ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాఘరాజ్ సింగ్‌పై డింపుల్ 2 లక్షల 88 వేల 461 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య అయిన డింపుల్ ఉదయం పోలింగ్ మొదలైన 8 గంటల నుంచి ఆధిక్యం కొనసాగిస్తూ వచ్చారు. డింపుల్‌కు మొత్తం 6,18,120 ఓట్లు పోల్ కాగా, బీజేపీ అభ్యర్థి 3,29,659 ఓట్లు సాధించారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఇటీవల కన్నుమూయడంతో మైన్‌పురి లోక్‌సభకు ఉప ఎన్నిక నిర్వహించారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ సదర్ అసెంబ్లీకి, కతౌలి అసెంబ్లీకి కూడా ఉప ఎన్నిక జరిగింది. రాంపూర్ సదర్‌లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తమ సమీప సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిపై గెలుపొందింది. బీజేపీ అభ్యర్థి ఆకాష్ సక్సేనా తన ప్రత్యర్థి ఎస్పీ అభ్యర్థి ఆసిం రజాపై 33,702 ఓట్ల ఆధిక్యంతో గెలుపు సాధించారు.
ఎస్పీ సీనియర్ నేత అజాంఖాన్‌కు కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలవడం ఇదే మొదటిసారి. ఒక కేసులో అజాం ఖాన్‌పై అనర్హత వేటు పడటంతో రాంపూర్ సదర్‌కు ఉప ఎన్నిక జరిగింది.
ఖతౌలి నియోజకవర్గంలో ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థి మదన్ భయ్యా 22,054 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయనకు 97,139 ఓట్లు పోల్ కాగా, బీజేపీ అభ్యర్థి రాజ్‌కుమారి సైని 74,996 ఓట్లు సాధించి ఓటమి పాలయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనిపై అనర్హత వేటు పడటంతో ఇక్కడ ఉపఎన్నిక జరిగింది.