కరోనా మహమ్మారి అనంతరం, దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత నాగపుర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైనప్పుడు ఓ మహిళా ఎమ్యెల్యే మూడు నెలలు కూడా నిండని పసిబిడ్డతో హాజరు కావడం అందరి దృష్టి ఆకట్టుకొంది. నాసిక్ జిల్లాలోని దేవ్లాలీ నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సరోజ అహిరే తన రెండున్నర నెలల పసికందుతో అసెంబ్లీకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆమె ఈ ఏఢాది సెప్టెంబర్ 30న బిడ్డకు జన్మనివ్వగా, బిడ్డతో కలిసి అసెంబ్లీలోకి వచ్చారు. ఎమ్మెల్యేతో పాటు తన భర్త, అత్త కూడా చంటి బిడ్డను చూసుకోవడానికి అసెంబ్లీకి వచ్చారు. ఎమ్మెల్యే సరోజ అహిరే చంటి బిడ్డను ఎత్తుకొని అసెంబ్లీకి వచ్చిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె తన చేతుల్లో నిద్రిస్తున్న శిశువును పట్టుకుని కనిపించింది.
సభకు హాజరయ్యే ముందు ఎమ్మెల్యే సరోజ అహిరే విలేకర్లతో మాట్లాడుతూ…”కరోనా కారణంగా నాగ్‌పూర్‌లో గత రెండున్నర సంవత్సరాలుగా ఎటువంటి సెషన్ నిర్వహించలేదు. నేను ఇప్పుడు తల్లిని, కానీ నా ఓటర్లకు సమాధానాలు చెప్పడానికి వచ్చాను” అని తెలిపారు.
“నేను తల్లితో పాటు ఎమ్మెల్యేను కూడా. ఈ రెండు విధులు ముఖ్యమైనవి. నా బిడ్డ చాలా చిన్నది. నేను లేకుండా ఉండలేదు. అందుకే బిడ్డను తీసుకురావాల్సి వచ్చింది. అసెంబ్లీలో మహిళా శాసనసభ్యులకు భోజనం చేసే గది లేదు. ప్రభుత్వం దీనిని పరిశీలించి శాసనసభ్యులు వారి కొత్తగా జన్మించిన పిల్లలను తమ వెంట తీసుకురావడానికి వీలుగా ఏదైనా ఏర్పాట్లు చేస్తే బాగుంటదని నేను భావిస్తున్నాను”అని ఆమె తెలిపారు.
ఇక సరోజ్ అహిరే దేవ్లాలీ అసెంబ్లీ స్థానంపై గట్టి పట్టు ఉంది. ఆమె తండ్రి బాబూలాల్ సోమ అహిరే మరణం తర్వాత.. దేవ్లాలీ రాజకీయ వారసత్వాన్ని రోజ్ అహిరే కొనసాగిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సరోజ్ అహిరే 41,702 ఓట్ల భారీ తేడాతో శివసేనకు చెందిన యోగేష్ బాబన్‌రావ్ ఘోలప్పై విజయం సాధించారు.