అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు సహా ఇతరులపై నమోదైన కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని ఎంపి రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు తాము బాధ్యులం కాదని సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పగా ఎవరు బాధ్యత వహిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. లోయర్ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని తుషార్ మెహతా పేర్కొన్నారు.
దర్యాప్తు సంస్థకు సంబంధం లేకపోతే ఎవరికి ఉంటుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులపై దాఖలైన పిటిషన్లను వేగంగా విచారించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఈ సందర్భంగా జగన్ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ ప్రస్తావించారు. అందుకని విచారణ ముగించాలని కోరారు.
హైకోర్టు సుమోటోగా ఆదేశాలు ఇచ్చినందున మూడు నెలల గడువు ఇవ్వాలని, ఆ తరువాత పరిశీలన జరపాలని వాదించారు. తాము ఈ పిటిషన్లపై విచారణ ముగించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. సమయమిచ్చి ఉపయోగం ఏమిటని, ఫలితం ఎక్కడా కనిపించడం లేదని వ్యాఖ్యానించింది.
ఇన్ని సార్లు వాయిదాలు పడటం, ఇంత కాలయాపన ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారంలో చేపట్టనున్నట్లు తెలిపింది. ఎంపి రఘురామ తరపున న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ వాదనలు వినిపించారు.