జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు హతమార్చారు. దీంతో సోపియాన్ జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శనివారం ఉదయం కశ్మీరీ పండిట్‌పై విచక్షణారహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న పండిట్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడిని పురాణ్ కృషన్ భట్‌గా పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం తన ఇంటి ముందు ఉండగా, అతనిపై టెర్రరిస్టులు దాడి చేశారు. కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు హత్య చేసినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ధృవీకరిస్తూ ట్వీట్ చేశారు.
“షోపియన్‌లోని చౌదరి గుండ్‌లోని ఒక పండ్ల తోటకు వెళుతున్న సమయంలో #ఒక పౌరుడు (మైనారిటీ) శ్రీ పురాణ్ క్రిషన్ భట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అక్కడ #చనిపోయాడు. ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. దర్యాప్తు జరుగుతోంది” అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.
పండిట్‌ను హత్య చేసిన ఏరియాతో పాటు సమీప ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదుల ఆచూకీ కనుగొనేందుకు చర్యలు ముమ్మరం చేశారు.
మరోవంక, ఉగ్రవాద సంబంధాలున్న ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించింది. ఈ ఉద్యోగులు నార్కో-సిండికేట్ నడుపుతూ, ఉగ్రదాడులు జరిపేందుకు నిర్దిష్ట ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్నారనే కారణంగా వీరిని సర్వీసు నుంచి తప్పించినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.
ఉద్వాసనకు గురైన ఉద్యోగులలో జమ్మకశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్ తన్వీర్ సలీమ్ డర్, బారాముల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ మేనేజర్ అఫఖ్ అహ్మద్ వని, బీడీఓ ఆఫీసు ప్లాన్టేషన్ సూపర్వైజర్ ఇఫ్తిఖర్ ఆండ్రబి, జల్ శక్తి శాఖకు చెందిన ఐర్షఆద్ అహ్మద్ ఖాన్, పీహెచ్ఈ సబ్‌డివిజన్ అసిస్టెంట్ లైన్‌మన్ అబ్దుల్ మొమిన్ పీర్ ఉన్నారు.
