రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియంతలా పరిపాలన సాగిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, సరైన నాయకుడు ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొడతారు, కానీ జగన్ మాత్రం నోరు ఎత్తిన ప్రతి వారిని అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు.
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి అరాచకం చూడలేదని కన్నా అన్నారు. ఫ్యాక్షనిస్టు పాలన ఎలా ఉంటుందో జగన్ చూపిస్తున్నారని ఆరోపించారు. విశాఖలో పవన్ను అడ్డుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలను గౌరవించుకోవాలని పేర్కొన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే చెప్పానని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాలనలో ఏం చేశారో చెప్పుకోలేకే ప్రతిపక్ష నేతలను తిడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. చరిత్రలో నరకాసురుడిని చూశామని, అలాంటి జగన్ను కూడా ప్రారద్రోలాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి రాక్షస పాలన అంతమొందించాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. దమ్ముంటే ఒంటరిగా రావాలని వైసీపీ మొనగాళ్లకు ఒకటే హెచ్చరిక చేస్తున్నట్లు చెప్పారు. దమ్ముంటే మందు, డబ్బు పంచకుండా వైసీపీ ఎన్నికలకు రావాలి’’ అని కన్నా లక్ష్మీనారాయణ సవాల్ చేసారు .