దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు వేగంగా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిష్టితి కలవరం కలిగిస్తున్నది. అక్కడ ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరపడంతో 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్యెల్యేలు కరోనాకు గురయ్యారని ఉపముఖ్యమంత్రి అజిత్ పవర్ తెలిపారు. దానితో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అక్టోబర్ 6 తర్వాత దేశంలో మొదటిసారి కరోనా ఆక్టివ్ కేసుల సంఖ్య లక్షకు దాటింది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కోవిడ్ కేసుల సంఖ్య ఏకంగా 22 వేలు దాటాయి. 400కు పైగా మరణాలు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులు కూడా 1400 దాటాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించిన వివరాల మేరకు… దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 1431 కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 200 కేసులు పెరగడం గమనార్హం. ఇప్పటివరకు మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ విస్తరించింది. మరోవైపు ఇప్పటివరకు 488 మంది కొత్త వేరియంట్ నుంచి కోలుకున్నారు.
అత్యధికంగా మహారాష్ట్రలో 454 మందికి కొత్త వేరియంట్ సోకింది. ఢిల్లీలో 351 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడు, గుజరాత్, కేరళలోనూ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 100 దాటడం ఆందోళనకరం.
ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11.10 లక్షల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 22,775 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు కూడా 2 శాతం దాటడం గమనార్హం.
ఇదే సమయంలో 8949 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.42 కోట్ల మంది వైరస్‌ను జయించారు. నిన్న ఒక్క రోజే 406 మంది కోవిడ్‌తో మృతి చెందారు. ఇప్పటివరకు 4.81 లక్షల మందిని వైరస్ బలితీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,04,781 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.30 శాతానికి పెరిగింది.
మరోవంక, కరోనా నివారణకుగాను భారత ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా సాగుతోంది. శుక్రవారం 58.11 లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 1.45 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం సంసిద్ధమవుతోంది.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 15-18 ఏళ్ల వారికి టీకా రిజిస్ట్రేషన్లు నేడు ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి కొవిన్ యాప్‌లో వీరంతా పేరు నమోదు చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ”పిల్లలు సురక్షితంగా ఉంటేనే దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. అర్హులైన పిల్లలందరికీ టీకాలు వేయించండి” అని మంత్రి కోరారు.