కరోనా వేరియంట్ ఒమైక్రాన్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాదాపు లాక్డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో పూర్తి స్థాయి కర్ఫ్యూ అమలు అవసరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు తదితర విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. కార్యాలయాలు, సినిమా హాళ్లు, థియేటర్లు, 50 శాతం సిబ్బందితో పనిచేయడానికి అనుమతించింది. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, మిల్లులు, తేయాకు తోటలు తదితర వాణిజ్య సంస్థల యాజమాన్యాలు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్‌కె ద్వివేది స్పష్టం చేశారు.
రోజూ రాత్రి 10 నుంచి తెల్లవారు జాము 5 గంటల వరకు మాత్రమే అత్యవసర సర్వీసులను అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. బార్లు, రెస్టారెంట్లు సగం సిబ్బందితో రాత్రి 10 గంటల వరకే పనిచేస్తాయి. రాత్రి 7 గంటల వరకు లోకల్ ట్రైన్లు 50 శాతం ప్రయాణికులతో నడుస్తాయని, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, సగం సిబ్బందితో రాత్రి 10 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని తెలియజేశారు.
ఇలా ఉండగా, ఆదివారం కేరళలో 45 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 152కు పెరిగింది. ఒడిశాలోనూ నేడు ఏకంగా 23 కేసులు వెలుగుచూశాయి. వీటితో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన ఒమైక్రాన్ కేసుల సంఖ్య 37కు చేరుకుంది. మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకూ ఒమిక్రాన్ విస్తరించింది.
ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు రెండు వారాలపాటు కేసుల భౌతిక విచారణను వాయిదా వేసింది. తిరిగి వర్చువల్ విధానంలోనే విచారణ కొనసాగించాలని నిర్ణయించింది. రెండు వారాల తర్వాత సమీక్షించి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్టు అత్యున్నత ధర్మాసనం తెలిపింది.
ఇలా ఉండగా, కరోనా మహమ్మారి కారణంగా 2021 జనాభా లెక్కల సేకరణ తొలి విడత నిరవధికంగా వాయిదా పడింది. దీంతోబాటు, జాతీయ జనాభా రిజిష్టర్ (ఎన్పిఆర్) తాజాపరిచే ప్రక్రియను ఇప్పుడున్న పరిస్థితి బట్టి సెప్టెంబరు దాకా చేపట్టే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి.
జిల్లాలు, ఉప జిల్లాలు, తహసీల్లు, తాలూకాలు, పోలీస్ స్టేషన్లు మొదలైన వాటి సరిహద్దులను స్తంభింపజేయాలన్న నిర్ణయాన్ని ఈ ఏడాది జూన్ వరకు వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా గత నెలలో రాష్ట్రాలకు తెలియజేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఎన్నికలు వాయిదా వేయండి
మరోవంక,గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో నిర్వహించే ఎన్నికలను వాయిదా వేయాలని అఖిల భారత బార్ అసోసియేషన్ ఆదివారం భారత ఎన్నికల సంఘానికి మెమోరాండం పంపింది. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఎఐబిఎ ప్రెసిడెంట్ సీనియర్ న్యాయవాది డాక్టర్ ఆదిష్ సి అగర్వాల్ మాట్లాడుతూ. కోవిడ్ ప్రోటోకాల్ పాటించకుండా ఎన్నికల ర్యాలీలకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడుతున్నారని తెలిపారు.
ఈ సమయంలో ఎన్నికలను వాయిదా వేయకపోతే తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అస్సాం, కేరళ, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ అనేక 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికల సమయంలో భారతదేశ ప్రజల నిర్లక్ష్యం కారణంగా కరోనా రెండో వేవ్ తీవ్రంగా వ్యాప్తి చెందిందని ఆయన గుర్తు చేశారు.