ప్రజల చేతిలో అధికారం పెడితే అంతా సర్దుకుంటుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్జ మ్మూకాశ్మీర్ ఎన్నికలపై వ్యాఖ్యానిస్తూ చెప్పారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ మసీదులో నమాజ్ చేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ దేశం కరోనా నుండి ఉపశమనం పొందడం పట్ల సంతోషం ప్రకటించారు.
కరోనా వల్ల ఎంతో మంది ప్రజలు రోడ్డున పడ్డారని చెబుతూ ఇప్పుడైన ప్రజల్లో విద్వేషాలు తొలగిపోవాలని కోరారు. పీడీపీతో నాయకురాలు మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే 2018 జూన్ లో ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగింది. అప్పటి నుంచి అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.
2019 ఆగస్టులో రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. ఈ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పటికీ శాసన సభను కలిగి ఉంది.
చాలా కాలంగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని అధికారులు పదేపదే హామీ ఇస్తున్నారు. గత ఏడాది స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశంలో త్వరలో ఎన్నికలు జరుగుతాయని భరోసా ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు అక్కడ ఎన్నికలు జరగలేదు. అయితే డీలిమిటేషన్ కమిషన్ తన తుది నివేదికను కొద్ది రోజుల్లో సమర్పించబోతోందని ఇటీవలి నివేదికలు వచ్చాయి.