కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో విజృంభిస్తున్నది. ఇప్పటి వరకు దేశంలో 200 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 54 కేసులు నమోదయ్యాయని పేర్కొంది.
ఆ తర్వాత తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్లో 18, కేరళలో 15, గుజరాత్లో 14, ఉత్తరప్రదేశ్లో 2, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్క కేసు నమోదైనట్లు చెప్పింది. సోమవారం వరకు దేశంలో 174 కేసులు నమోదవగా.. మంగళవారం వరకు 200కు పెరిగాయి.
ఇప్పటి వరకు మహారాష్ట్రలో 28 మంది, ఢిల్లీలో 12 మంది, కర్ణాటకలో 15 మంది, రాజస్థాన్లో 18, ఉత్తరప్రదేశ్, ఏపీ, బెంగాల్లో బాధితులు కోలుకున్నారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.
కాగా, దేశంలో గడిచిన 24 కొత్తగా 5,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజాగా 8,043 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి బారినపడి 453 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 79,097 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది.
దేశంలో ఇప్పటి వరకు 3,47,52,164 కేసులు నమోదవగా.. ఇందులో 3,41,95,060 మంది కోలుకున్నారు. 4,78,007 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. టీకా డ్రైవ్లో భాగంగా మొత్తం 1,38,34,78,181 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల్లో యాక్టివ్ కేసులు 0.24శాతంగా ఉన్నాయని పేర్కొంది.
కాగా, పన్నెండేళ్ల లోపు చిన్నారులకు టీకా ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ప్యానెల్ లోని ఓ సభ్యుడు చెప్పారు. డేటా ప్రకారం చూసుకుంటే.. పిల్లలకు వెంటనే వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం లేదని నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ ఇన్ ఇండియా (ఎన్టీఏజీఐ) మెంబర్ డాక్టర్ జయప్రకాశ్ ములియాల్ తెలిపారు.
ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తమ ప్యానెల్ తెలియజేసిందని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి ఒక్క చిన్నారి కూడా చనిపోలేదని.. కాబట్టి వాళ్లకు అత్యవసరంగా టీకా ఇవ్వనక్కర్లేదని ఓ నేషనల్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ములియాల్ పేర్కొన్నారు.