ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్రతిష్ఠలకు నెలవు అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమని.. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ఆమె ప్రశంసించారు. ఎపి పర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం చేసింది.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని చెబుతూ భగవంతుడు తన ప్రార్థనను తప్పక నెరవేరుస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు, కవయిత్రి మొల్ల, దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ తదితరుల పేర్లను ఆమె ప్రస్తావించారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదులు రాష్ట్రాన్ని పునీతం చేశాయని పేర్కొన్నారు.
నాగార్జున కొండ, అమరావతి ఆధ్యాత్మిక కేంద్రాలకుగా విలసిల్లుతున్నాయని కొనియాడారు. అందరి అభిమానానికి రాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపారు.
సీఎం జగన్ మాట్లాడుతూ..దేశచరిత్రలో తొలిసారిగా ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి పదవి చేపట్టడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని తెలిపారు. రాష్ట్రపతి పదవిలో తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ద్రౌపదీ ముర్మును గౌరవించుకోవడం మనందరి బాధ్యతగా భావించి పౌర సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
సామాజిక వేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా అణగారిన వర్గాల ప్రజల కోసం ఆమె కఅషి చేశారని కొనియాడారు. జీవితంలో ద్రౌపదీ ముర్ము పడిన కష్టాలు.. వాటిని చిరునవ్వుతో స్వీకరించి ముందుకు సాగిన తీరు దేశంలోని ప్రతి మహిళకూ ఆదర్శమన్నారు. నిష్కళంకమైన రాజకీయ జీవితం, ఎదిగిన తీరు మహిళలకు స్ఫూర్తిదాయకమని జగన్ తెలిపారు.
పోరంకిలో పౌరసన్మాన కార్యక్రమం అనంతరం విజయవాడలోని రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ అధికారిక విందు ఇచ్చారు. ఈ విందులో సీఎంతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.